Oct 27,2023 12:05
  • సంయుక్త కిషన్ మోర్చా జిల్లా కమిటీ కన్వీనర్  హరే రామ్ 

ప్రజాశక్తి-భీమవరం : ఢిల్లీ రైతులు చేపట్టిన ఉద్యమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ నవంబర్ 27 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించబోయే  మహా ధర్నాను జయప్రదం చేయాలని సంయుక్త కిషన్ మోర్చా జిల్లా కమిటీ కన్వీనర్ ఆకుల హరే రామ్ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో  శుక్రవారం నిర్వహించిన సమావేశానికి తెలుగు రైతు నాయకులు తమ్మినీడు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరే రామ్  మాట్లాడుతూ  ఢిల్లీలో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై 500 రైతు సంఘాల పైగా 13 నెలలు పాటు చేసిన ఆందోళన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీటిని నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన ధర్నాకు నవంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు భీమవరంలో ఆనంద ఫంక్షన్ హాల్ లో సమన్వయ రైతు సదస్సు నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశ్వరరావు  హాజరుకానున్నారన్నారు. రైతులంత మహా ధర్నాలో  పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం న్యూస్ క్లిక్ ఎడిటర్ తదితరులపై పెట్టిన ఎఫ్ఐఆర్.లో రైతు ఉద్యమానికి విదేశీ నిధులు అందించిందని పేర్కొన్నదని అందుకు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మన జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నవంబర్ 6వ తేదీన ఎఫ్ఐఆర్ కాపీలు దగ్ధం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో అఖిలభారత అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు లంకా కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు దండు శ్రీనివాసరాజు, తెలుగు రైతు టౌన్ అధ్యక్షులు పాల శ్రీరామదాసు, రైతు సంఘం నాయకులు చెల్ల బోయిన రంగారావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జె ఎన్ వి గోపాలన్ పాల్గొన్నారు.