Jul 02,2023 20:45
  •  పథకం అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా..?
  •  చంద్రబాబు, లోకేష్‌లకు మంత్రి రజిని సవాల్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆరోగ్యశ్రీ పథకంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సవాల్‌ విసిరారు. గుంటూరులోని ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాలో ఆమె ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్‌ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, టిడిపి హయాంలోనే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని విమర్శించారు. టిడిపి ప్రభుత్వంలో కేవలం 919 ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు అందేవని తెలిపారు. రోజుకు సగటున 1570 మందికే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిందని, 1057 ప్రొసీజర్లకు మాత్రమే చికిత్స అందించారని పేర్కొన్నారు. ఏడాదికి సగటున రూ.వెయ్యి కోట్లే ఖర్చు చేశారని విమర్శించారు. గత నాలుగేళ్లలో రోజుకు సగటున ఏకంగా 3400 మంది రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారని, ఈ ఒక్క ఏడాదే రూ.3400 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3257కు పెంచామన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆరోగ్యశ్రీ అమలు విధానం, 2019-23 వరకు అమలు చేసిన తీరుపై చంద్రబాబు, లోకేశ్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.