
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు తెలియజేశారు. మండల పరిధిలోని హస్తవరం గ్రామ పంచాయతీ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారు పాల్గొని ప్రసంగిస్తూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటినీ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్య పరంగా సురక్షితంగా ఉంచడమే జగనన్న ఆరోగ్య సురక్ష అని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం లాంటిదన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేదల కోసం శ్రమిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే తపనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అన్ని రకాల జబ్బులకు మెరుగైన వైద్యం అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గుండె జబ్బులతో బాధపడుతున్న ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు హస్తవరం మహీంద్రా రెడ్డి, లక్ష్మీకర్ రెడ్డి, వైయస్సార్సీపి రాజంపేట మండల అధ్యక్షులు రామ్మోహన్ నాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ రాజు, జెడ్పిటిసి ప్రతినిధి దాసరి పెంచలయ్య, దండు గోపి, సావిత్రి చంద్రనాథ్, శివ ప్రసాద్ రెడ్డి, విజయనసింహరాజు, ఉప సర్పంచి నరసింహారాజు, రామ్మోహన్ రాజు, రఘుపతి రాజు, వార్డ్ సభ్యులు సుబ్బ నరసయ్య, కనకయ్య, ఆదినారాయణ రాజు, మనోహర్ రాజు, వెంకటేశ్వర్ రాజు, వినోద్ రాజు తదితరులు పాల్గొన్నారు.