
ప్రజాశక్తి-కాకినాడ : పేద వర్గాల ప్రజలకు అండగా ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోందని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు. వేరికోయిస్ (నరాల వ్యాధికి) అరుదైన చికిత్సను తాను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు నరాల వ్యాధి నిపుణులు డా.కె.సంజీవరావు అందించడం సంతోషాదయకమని అన్నారు. డా.కె.సంజీవరావు బిఆర్ఎం కేర్వెల్ ఆసుపత్రి ద్వారా అందించనున్న చికిత్స సంబంధించి ఆదివారం పాత్రికేయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ప్రాధమిక దశలోనే తగిన చికిత్స పొందాలని, ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎం సహాయ నిధినుండి ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. నిపుణులు డాక్టర్ కె సంజీవరావు మాట్లాడుతూ ఈ వ్యాధికి దేశవ్యాప్తంగా కేవలం 350 మంది మాత్రమే వైద్యులు ఉన్నారని, ఈ అరుదైన వ్యాధిని కొందరు వైద్యులు సకాలంలో గుర్తించకపోవడం వల్ల ప్రమాద తీవ్రత బాగా పెరిగిపోతుందన్నారు. నరాల ఉబ్బడం, వాచిపోవడం, వారికి తెలియకుండా రక్తం గడ్డకట్టడం రక్తం కారిపోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధి ద్వారా బయటపడతాయన్నారు. ఒకానొక దశలో రక్తం గడ్డ కట్టడం వల్ల కాలు కుళ్లి పోయి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన లక్షణాలు ముందుగా గ్రహిస్తే దాని తీవ్రత నుండి బయట పడే అవకాశం ఉందన్నారు. ఆగస్టు నెలలో ఈ వ్యాధిపై విస్తృత ప్రచారం చేస్తున్నామని అందులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మొదటి యాబై మందికి ఉచితంగా వైద్యాన్ని బిఆర్ఎం ఆసుపత్రిలో అందిస్తామని చెప్పారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంజీవరావు తెలిపారు. ఈ వ్యాధి ఆహారపుఅలవాట్లు సుగర్, బీపీ ఉన్నవారికి అధికంగా ప్రబలుతుందన్నారు. ఈ సమావేశంలో కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న, నాయకులు సుంకర విద్యాసాగర్, జే చైతన్య తదితరులు పాల్గొన్నారు.