Jul 27,2023 08:28
  • దుడ్డు ప్రభాకర్‌, శిరీష బంధువుల విమర్శ
  • వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్‌, మావోయిస్టు రామకృష్ణ భార్య కె శిరీషను ఎన్‌ఐఎ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంతోపాటు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులతోపాటు విరసం నాయకులు తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుడ్డు ప్రభాకర్‌ భార్య కుసుమకుమారి, శిరీష బావ, విరసం నేత కళ్యాణరావు, విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, కార్యదర్శి రివేరా, పిడిఎస్‌యు నాయకులు రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ నెల 21న సాయంత్రం నాలుగు గంటల సమయంలో శిరీషను మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిపారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినలేదని, మందులు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ జీవితంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని చట్ట వ్యతిరేక కార్యకలాపాల పేరుతో అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. దుడ్డు ప్రభాకర్‌ కుల నిర్మూలన కోసం పోరాడుతున్నారని అన్నారు. ఇంట్లోంచి బలవంతంగా కిందకు తీసుకొచ్చి అనంతరం అరెస్టు చేశామని చెప్పారని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని తెలిపారు. తీసుకెళ్లింది ఎవరో తెలియకపోవడంతో స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడ సిఐ తెలిపారని పేర్కొన్నారు. ప్రజలందరూ చూస్తుండగా తీసుకెళ్లి ఆయన వద్ద ఆయుధాలు, సాహిత్యం దొరికాయని ఎన్‌ఐఎ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో దుడ్డు ప్రభాకర్‌ తమ్ముడు వెంకట్రావు, కుమార్తె స్వాతి, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.