శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరో రౌండ్ ఉద్యోగుల కోతకు సిద్ధమౌతోంది. రాబోయే కొద్ది నెలల్లో దశల వారీగా తొలగింపు ప్రక్రియ ఉండవచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వేల మందిపై వేటు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది మెటా.. సుమారు 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా.. ఈ ఏడాది అది 13 శాతానికి సమానం కానుందని పేర్కొంది. ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా సంస్థ వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్- ఇంజినీరింగ్ రోల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగుల వేటు ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు కొన్ని ప్రాజెక్టులు, గ్రూప్‌లను కూడా మూసివేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగుల తొలగింపుపై గతంలోనే పరోక్ష సూచన చేశారు. కొన్ని ప్రాజెక్టులను కూడా నిలిపివేయనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.










