ఒక దుఃఖపు నేల మీంచి వస్తున్నాను
బతుకుపోరులో ఓడిపోయీ ..
అడవిలో ఆకుల్లా రాలిపోయిన
పురా జ్ఞాపకాల ఆదివాసీగూడల్లోంచి వస్తున్నాను
పాపికొండల అందాల మాటున
పడగలెత్తిన జలకోర
గూడేల్నీ, గూడేల్లోని బతుకుల్నీ మింగేసాక
మనుషుల ఆనవాళ్లులేని
మరుభూముల్లోంచి వస్తున్నాను !
దుఃఖం పూడుకుపోయిన గూడల గడపల్లో
ఆరని కన్నీటి తడిని ఒత్తుకుంటూ వస్తున్నాను
పునరావాసం కల్పిస్తామనీ ..
పరిహారమందిస్తామనీ ..
నీటిమీద మాటలతో నమ్మించిన రాజ్యం
పుట్టి పెరిగిన తరాల నేల మీంచి
ఆదివాసీ బిడ్డల్ని తరిమిగొడుతున్న
ఒక దుర్భర సందర్భంలోంచి వస్తున్నాను !
అమతోత్సవాల వేళ ..
ఒక అరణ్య రోదనలోంచి వస్తున్నాను
బతుకు తెరువు కానరాక బావురుమంటోంది
పైడిపాక
మౌనంగా తలబాదుకుంటోంది
మామిడిగొంది
దశాబ్దాల దుఃఖం ముందు చేతులెత్తేసింది
చేగొండపల్లి
పొగిలి పొగిలి రోదిస్తోంది పోలవరం
దశాబ్దాల వనవాసం ముగిసినా ...
ఇంకా వెలుతురు ఛాయలు కనిపించని
వందలాది గిరిజన గూడేల
చీకటి కన్నీళ్లను చేదుకుంటూ వస్తున్నాను
నోటికాడ మెతుకునూ,
మట్టిమీద బతుకునూ కోల్పోయీ ..
కన్నీళ్లమీంచి కాలాన్ని దాటుతున్న
ఒక నిర్వాసిత నేలమీంచి వస్తున్నాను !
చెట్టూ పుట్టా పిట్టా పులుగూ గొడ్డూ గోదా
సమస్త పాశాలు జలసమాధయ్యేక ..
అనేకానేక శిశిర గీతాల్నీ
బృందగానాలుగా పాడుకుంటున్న గోధూళి వేళల్నీ
తలకెత్తుకుంటూ వస్తున్నాను
కూలిచేస్తే గానీ కుండాడని బతుకులన్నీ
అడవితో అంటు కట్టుకున్న బంధాలను ..
మట్టితో పెనవేసుకున్న
తరాల రుణానుబంధాల్ని తెంచుకొనీ ..
ఊరునీ, ఉనికినీ కోల్పోయిన
ఒకానొక వలసదుఃఖంలోంచి వస్తున్నాను !
రేపటి పోరాటానికి ..
తూరుపు తురాయి పూల వనంలో దాచిన
విల్లమ్ములు వాళ్లకందించే వస్తున్నాను!
- సిరికి స్వామి నాయుడు










