ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొండిగా వ్యవహరించి ముందుకెళ్తే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని రాష్ట్ర ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మొండిగా వ్యవహరిస్తే తాము కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల కోసం ప్రాణాలను పణంగా పెట్టలేమన్నారు. తమకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని రెండు నెలలుగా ఎన్నికల కమిషన్‌ను కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను సత్వరం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాయిదా కోసం అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామ న్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోందన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాధించుకుంటామని చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.










