ప్రజాశక్తి-పొన్నూరు: మండలంలోని బ్రాహ్మణకోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఓట్లు రీకౌంటింగ్ చేయాలని ఎమ్మెల్యే కిలారు రోశయ్య, వైసిపి నాయకులు కోటా శ్రీనివాసరావు, ఆ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సౌపాటి ప్రేమకుమార్‌బాబు డిమాండ్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఒక పక్షానికి కొమ్ము కాచి ఫలితాన్ని తారుమారు చేసి ప్రకటించారని వారు ఆరోపించారు. బుధవారం ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 3 వేలలోపు ఓట్లు కలిగిన అన్ని గ్రామాలకు లెక్కింపు రాత్రి 9 గంటలకు ముగియగా బ్రాహ్మణకోడూరు గ్రామ రిటర్నింగ్ అధికారి తెల్లవారు జాము 4 గంటల వరకు జాప్యం చేసి టీడీపీ అభ్యర్థి కొర్నేపాటి అశోక్ 11 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందినట్లు ప్రకటించి అన్యాయానికి పాల్పడ్డారని ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో రెండు పర్యాయాలు కరెంట్ పోవడం, ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ సబ్ కలెక్టర్ అడిగేవరకు ఫలితాన్ని ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పోలింగ్ ఏజెంట్లను సైతం ఖాతరు చేయలేదన్నారు. సర్పంచ్ ఓట్లు రీకౌంటింగ్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.










