Apr 13,2023 07:57
  • భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా
  • తరలివచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లు

ప్రజాశక్తి - భీమవరం : ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని, ప్రభుత్వం కళ్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో గద్దె దింపుతామని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీర్ఘకాలంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ తమపై కక్షపూరితంగా వ్యవహరించడంతోపాటు ఉద్యోగులతో తమకు సంబంధం ఏంటి అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది ఉన్నామని తామంతా తలుచుకుంటే ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ముక్తకంఠంతో హెచ్చరించారు. ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండో దశ ఉద్యమాన్ని ఉద్యోగులు చేపట్టారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు వందలాదిమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో టెంట్‌ ఏర్పాటు చేసుకుని బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పటికైనా తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. తాము ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నామని అయితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌.కృష్ణమోహన్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.జేమ్స్‌గాబ్రియేలు, సెక్రటరీ ఎస్‌.సత్యనారాయణరాజు, కో ఆపరేటివ్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ జె.వెంకటేశ్వరరావు, ఎస్‌.శ్రీనివాసరావు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం పాలకొల్లు నాయకులు అజరు కుమార్‌, ఎపి జెఎసి అమరావతి జిల్లా ప్రెసిడెంట్‌ శివ శంకర్‌, కార్యదర్శి ఫణి, ఎపిఆర్‌ఎస్‌ఎ జిల్లా కార్యదర్శి ప్రసాదరాజు, కలెక్టరేట్‌ సీనియర్‌ సహాయకులు వివి.పెద్దిరాజు, పి.జగన్మోహన్‌, పివి.సాంబశివ రావు, కె.సురేష్‌, సిబ్బంది, బుజ్జియ్య, సూర్యకాంతం, సత్యనారాయణ, వెంకట రత్నం వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.