Nov 17,2023 10:57

ప్రజాశక్తి- యంత్రాంగం : కనీస పెన్షన్‌ అమలు చేసే అంశంలో సుప్రీంకోర్టు, ఇపిఎఫ్‌ఒ ఆదేశాలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పుదారి పట్టిస్తోందని, పెన్షనర్లంతా ఐక్యంగా నరేంద్రమోడీని సాగనంపాలని ఎఐసిసిఇపిఎఫ్‌పిఎ, ఎపిఆర్‌పిఎ డిమాండ్‌ చేశాయి. పెన్షనర్ల సమస్యలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎఐసిసిఇపిఎఫ్‌పిఎ, ఎపిఆర్‌పిఎ ఆధ్వర్యాన విద్రోహ దినం పేరుతో అన్ని జిల్లాల పిఎఫ్‌ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పిఎఫ్‌, తహశీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. విజయవాడలో జరిగిన విద్రోహ దినం కార్యక్రమంలో ఎఐసిసిఇపిఎఫ్‌పిఎ, ఎపిఆర్‌పిఎ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ఎ శాస్త్రి, కె సత్తిరాజు మాట్లాడారు. తమ జీవితంలో ఎక్కువ కాలం సర్వీసు చేసిన ఉద్యోగికి సామాజిక బాధ్యతగా కేంద్రం చెల్లించాల్సిన పెన్షన్‌ను నామమాత్రంగా చెల్లిస్తోందని విమర్శించారు. పెన్షన్‌ అంశంపై సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. బిజెపి సర్కార్‌ను సాగనంపేందుకు పెన్షనర్లంతా నడుంబిగించాలని అన్నారు. మోడీని ఇంటికి పంపేదాకా అంచెలంచెలుగా ఈ పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు. విశాఖ మర్రిపాలెం పిఎఫ్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పెన్షనర్లను ఉద్దేశించి ఇపిఎస్‌ - 95 పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇపిఎస్‌ - 95 పెన్షన్‌ పథకాన్ని అమలు చేసి నేటికి 28 ఏళ్లు అవుతున్నా, ఇప్పటి వరకూ కనీస పెన్షన్‌ సవరణగాని, పెంపుగానీ లేకుండా పెన్షనర్లను మోసగిస్తూ వస్తోందన్నారు. తక్షణం కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలుతోపాటు డిఎను అనుసంధానం చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందరికీ హయ్యర్‌ పెన్షన్‌ అవకాశం కల్పించాలని కోరారు. భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, రైల్వే రాయితీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పిఎఫ్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.