
ఐసిఆర్‌ఐఎ మచిలీపట్నం డివిజన్ 23వ మహాసభలో కె మోహనరావు
ప్రజాశక్తి- విజయవాడ :ప్రభుత్వ బీమా కంపెనీల పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, దీనిని తిప్పికొట్టేందుకు పెన్షనర్లందరూ ఏకం కావాలని ఆలిండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఎఐఐపిఎ) జాతీయ ఉపాధ్యక్షులు కె.మోహనరావు పిలుపునిచ్చారు. విజయవాడలోని గవర్నర్‌పేట బాలోత్సవ్ భవన్‌లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసిఆర్‌ఐఎ) మచిలీపట్నం డివిజన్ 23వ మహాసభ ఆదివారం జరిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి పెన్షనర్లు మహాసభకు హాజరయ్యారు. ఇ.జగన్మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ముఖ్యఅతిథిóగా పాల్గన్న మోహనరావు మాట్లాడుతూ ఫామిలీ పెన్షన్ 30 శాతం ఇవ్వడానికి యాజమాన్యాలు అంగీకరించి ప్రభుత్వ ఆమోదానికి పంపి నాలుగు సంవత్సరాలైందన్నారు. ఇతర రంగాల్లో ఆమోదించినా ఎల్‌ఐసి, జిఐసిలలో ఆమోదించకపోవడం వివక్ష చూపడమేనని విమర్శించారు. ఎల్‌ఐసి పెన్షనర్ల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 12న తలపెట్టిన రెండు గంటల వాకౌట్ సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ వాటాల అమ్మకం, ఏజెన్సీ వ్యవస్థలో మార్పులు, సంస్థాగత సంస్కరణల పేరిట చర్యలు మొదలు పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా పట్టాదారుల సంక్షేమం, దేశహితం కోసం ప్రభుత్వ బీమా రంగ ఉద్యోగులు పోరాడుతున్నారన్నారు. ఐఎంఎఫ్ నిర్దేశిత పెన్షన్ సంస్కరణలు అన్ని రంగాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూడడంతో, ఆయా రంగాల పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల పెన్షనర్ల ఐక్య పోరాటానికి కృషి జరుగుతోందన్నారు. ఉద్యోగ సంఘం నాయకులు జి.కిశోర్‌కుమార్ మాట్లాడుతూ పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, బీమా ప్రీమియంపై జిఎస్‌టి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బీమారంగ పరిరక్షణకు, పాలసీదారుల ప్రయోజనాలకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ మహాసభలో యూనియన్ నాయకులు కె.ఎస్.మూర్తి, బిహెచ్‌విఎల్.రాధాకృష్ణమూర్తి, జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షులుగా పి.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బిహెచ్‌విఎల్.రాధాకృష్ణమూర్తి ఎన్నిక
అనంతరం 30 మందితో నూతన కమిటీ ఏర్పడింది. అధ్యక్షులుగా పి.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బిహెచ్‌విఎల్.రాధాకృష్ణమూర్తి, కోశాధికారిగా పి.నాగయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నలుగురు, సహాయ కార్యదర్శులుగా నలుగురు ఎన్నుకోబడ్డారు.