దేశంలో అత్యున్నత న్యాయస్థానం న్యాయాన్ని అందించడంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం అత్యంత దురదృష్టకరం. ఇంటీరియర్ డిజైనర్‌ను, ఆమె తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టి.వి వ్యవస్థాపకుడు అర్నబ్ గోస్వామికి వారం రోజుల్లో బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం, కేరళ జర్నలిస్టు సిద్ధిఖి కప్పన్‌కు 43 రోజులైనా బెయిలు ఇవ్వకుండా జైలులోనే ఉంచడం పలు విమర్శలకు తావిచ్చింది. గోస్వామి వృత్తిరీత్యా జర్నలిస్టు. బిజెపి, ఆరెస్సెస్ విద్వేషపు ఎజెండాను బాహాటంగా ప్రచారం చేసే అతనికి మహారాష్ట్రలోని కింది కోర్టు బెయిలు తిరస్కరిస్తే, సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆశ్రయించిన 24 గంటల్లోపే అతనికి బెయిలు దొరికింది. లక్షల కొద్దీ బెయిలు పిటిషన్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండగా, వాటన్నిటిని పక్కన పెట్టి గోస్వామి పిటిషన్‌కు అంత ప్రాధాన్యమివ్వడంలో ఔచిత్యమేమిటి? గోస్వామికి బెయిలు మంజూరైన మరుసటి రోజే కేరళ జర్నలిస్టు కప్పన్ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రాగా దానిని ఈ నెల 20 వ తేదీవరకు వాయిదా వేసింది. గోస్వామికి ఒక న్యాయం, కప్పన్‌కు ఒక న్యాయమా? ఇంతకీ కప్పన్ చేసిన నేరమేమిటి? దేశవ్యాపితంగా సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన వార్తలను కవర్ చేయడానికి హథ్రాస్‌కు బయల్దేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆయనను, మరో ముగ్గురు హక్కుల కార్యకర్తలను యు.పి పోలీసులు అరెస్టు చేసి రాజద్రోహం, యుఎపిఏ చట్టాల కింద తప్పుడు కేసులు బనాయించారు. అరెస్టు చేయడానికి ముందు కప్పన్ పని చేసే పత్రిక యాజమాన్యానికి కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది కచ్కితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. కప్పన్‌ను విడుదలజేయాలని కోరుతూ కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ హెబియస్ పిటిషన్ దాఖలు చేస్తే, అ పిటిషన్‌లో సవరణలు చేపట్టి, కింది కోర్టుకు వెళ్లాలని సుప్రీం సూచించింది. ఆ ప్రకారమే మధురలోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా కోర్టు దానిని కొట్టివేసింది. దీంతో మళ్లీ సుప్రీంను ఆశ్రయించగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నాన్చడం న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతకే కళంకం. ఒక్క కప్పన్ విషయంలోనే కాదు, చాలా మంది పీపుల్స్ జర్నలిస్టుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికత నేతి బీరకాయలో నెయ్యి చందమే అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై అసమ్మతి తెలియజేసినా, మానవ హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించినా బిజెపి ప్రభుత్వాలు సహించలేకపోతున్నాయి. ఇంతకు ముందు ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాకు రెండు మాసాల తరువాత కానీ బెయిలు మంజూరు కాలేదు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేసినందుకు యు.పి పోలీసులు ఆయనను ఉపా చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈశాన్య ప్రాంతంలో 39 ఏళ్ల కిషోచంద్ర వాంఖేమ్ సోషల్ మీడియాలో ప్రధాని మోడీని, మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌ను విమర్శిస్తూ పోస్టింగ్‌లు పెట్టినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసు బనాయించి నాలుగు మాసాల పాటు బెయిలు పుట్టకుండా చేశారు.
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక కేంద్ర ప్రభుత్వం సామూహికంగా అరెస్టులకు తెగబడుతూ, పౌర స్వేచ్ఛను యథేచ్ఛగా హరిస్తుంటే న్యాయవ్యవస్థ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది తప్ప ఈ హక్కుల పరిరక్షణకు ఎలాంటి చొరవ చూపలేకపోయింది. బీమా కోరెగావ్ కేసులో యుఎపిఎ చట్టం కింద అరెస్టు చేసిన 84 ఏళ్ల స్టాన్ స్వామి, 79 ఏళ్ల వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నా బెయిలు ఇవ్వడానికి కోర్టు ససేమిరా అంటున్నది. మోడీ భజన తప్ప మరే క్వాలిఫికేషన్ లేని అర్నబ్ గోస్వామికి మాత్రం ఆగమేఘాల మీద కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని విమర్శిస్తూ కమెడియన్ కునాల్ కమ్రా ట్వీట్ చేసినందుకు ఆయనపై కోర్టు ధిక్కారం కింద కేసు పెట్టారు. అయినా, తాను మాత్రం ఆ వ్యాఖ్యలకు కట్టుబడే వున్నానని కమ్రా స్పష్టం చేయడం గమనార్హం. న్యాయవ్యవస్థను నయానా, భయానా లొంగదీసుకునేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేపడుతున్న నీచపుటెత్తుగడలే దీనికి ప్రధాన కారణం. పదవీ విరమణ చేసిన కొద్ది రోజులకే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోరుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం ప్రసాదించడం, అంతకుముందు మాజీ న్యాయమూర్తి సదాశివన్‌ను గవర్నరుగా నియమించడం ఇవన్నీ మోడీ ప్రభుత్వ కుటిల పన్నాగంలో భాగమే. ఇటువంటి నీచపు ప్రలోభాలకు లొంగకుండా వీటికి అతీతంగా, నిష్పాక్షికంగా న్యాయ వ్యవస్థ వ్యవహరించి తన స్వతంత్రతను కాపాడుకోవడమే గాక వ్యవస్థల నడుమ సమతుల్యతను నిలబెట్టాలి.










