
- ముగిసిన వాదనలు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ఎపికి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన కేసులో తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ ఆరాదే, జస్టిస్ ఎన్‌వి.శ్రావణ్ కుమార్‌ల డివిజన్ బెంచ్ ప్రకటించింది. ఎపికి విద్యుత్ బకాయిలు రూ.3441.78 కోట్లు చెల్లించకపోవడంతో సర్‌చార్జ్ రూ.3315.14 కోట్లతో కలిపి మొత్తం రూ.6756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలంటూ గత అగస్టు 20న కేంద్రం ఉత్తర్వులిచ్చింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి. గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. రాష్ట్రం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, విద్యుత్ సంస్థల తరఫున వై.రామారావులు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడితే కేంద్రం జోక్యానికి వీల్లేదన్నారు. దక్షిణ ప్రాంత మండలిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎపి నుంచి తమకు బకాయిలు రావాలన్నారు. కేంద్రం పెత్తనం చేసే క్రమంలోనే ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఎపి తరుపు సీనియర్ లాయర్ సివి మోహన్‌రెడ్డి, ఎపి విద్యుత్తు సంస్థల తరఫున సీనియర్ లాయర్ ఎం.విద్యాసాగర్ ప్రతివాదన చేస్తూ గతంలో మాదిరిగా విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం చెప్పినట్టుగా చేశామనీ, విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తమ విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయని చెప్పారు. కేంద్రం చెప్పిందని 2017 వరకు ఎపి విద్యుత్‌ను సరఫరా చేసిందన్నారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్ వాదిస్తూ విద్యుత్, బొగ్గు వంటి అంశాలపై వివాదం ఏర్పడితే కేంద్రం జోక్యం చేసుకోవచ్చని చెప్పారు. అందుకే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులిచ్చినట్టు పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా