జకార్తా/కౌలలంపూర్ : కరోనా అనంతరం ఇండోనేషియా, మలేషియాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రంజాన్ ముగింపు సందర్భంగా ఉదయం ప్రార్థన కోసం వేలాది మంది ముస్లింలు శనివారం ఉత్తర జకార్తాలోని సుందా కెల్పా పోర్ట్‌కు చేరుకున్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో గతంలో మాదిరిగా ప్రార్థనల కోసం వేలాది మంది ముస్లింలు హాజరవడం గమనార్హం. స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు. గత మూడేళ్లుగా తమ కుటుంబాలను కలుసుకునేందుకు అవకాశం కలగలేదని.. ఇప్పుడు అందరం ఒక్కచోట వేడుకలు చేసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందని మరో వ్యక్తి అదిత్ చంద్ర పేర్కొన్నారు. ఇండోనేషియా జనాభాలో సగానికి పైగా ( సుమారు 12 కోట్ల మంది)లో చంద్ర ఒకరు. ఈద్ ఉల్ ఫితర్ కోసం పట్టణాల నుండి వారి స్వస్థలాలకు చేరుకున్న వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది.
కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా తమ కుటుంబసభ్యులతో పండుగ జరుపుకోలేకపోయామని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని కౌలాలంపూర్‌కి చెందిన ఖైరుల్ పేర్కొన్నారు. పండుగ కోసం ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకుండా మలేషియాకు చేరుకున్నామని సింగపూర్‌లో పనిచేస్తున్న ముహ్ద్ నూర్ తెలిపారు. గతేడాది కుటుంబసభ్యులకు వీడియో కాల్‌లో శుభాకాంక్షలు తెలిపామని అన్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇరు దేశాలు హెచ్చరించాయి.