దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన సాగుతున్నా, మన రాష్ట్రంలో మాత్రం ఆందోళన పడనవసరం లేదని, తమ పాలనలో రైతులకు సంక్రాంతి ముందే వచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు భరోసా ఇచ్చేందుకే ఆర్‌బికెలున్నాయని కూడా ప్రచారం చేసింది. ఈ రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె)లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని వార్తలు వస్తున్నాయి. మద్దతు ధర లక్ష్యానికి మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి తూట్లు కొడుతున్నారని, దళారుల ఆధిపత్యం కొనసాగుతుండటంతో, రైతులకు దీనావస్థ తప్పడం లేదన్నది వీటి సారాంశం! భరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడికి కొంత సాయం అందిస్తోంది. నివర్ తుపాన్ విరుచుకుపడి నెల రోజులు తిరగకముందే పంట నష్టపరిహారాని కూడా చెల్లిస్తోంది. ఇంత త్వరగా గతంలో ఎన్నడూ చెల్లించలేదని ప్రభుత్వం చెబుతోంది. అయినా, రైతులకు దీనాలాపాలు ఎందుకు తప్పడం లేదు? రైతాంగానిది పెట్టుబడులకు నిధుల సమస్యో, ప్రకృతి ప్రకోపం చేత నష్టపోయిన పంట పరిహారం సమస్యో కాదు. సాగుదారులు ఎదుర్కుంటున్న అనేక కష్టాల్లో అవి కూడా ఒక భాగం అంతే! ఈ కష్టాలన్నింటికీ మూలమైన సమస్యను పరిష్కరించకుండా ఆపద మొక్కులు తీర్చినంత మాత్రాన రైతుల కన్నీళ్లు తుడిచినట్టుకాదు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్టు కాదు.
ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘంగా సాగుతున్న రైతాంగ ఆందోళనలో కీలకాంశం కూడా ఇదే! ఆరుగాలం చేసిన శ్రమకు, పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావడం లేదన్నది రైతుల ఆవేదన! ఉత్పత్తి ఖర్చులమీద కుటుంబ పోషణ, విద్య, వైద్యాలకు అవసరమయ్యే కనీస మొత్తం అదనంగా కావాలని కోరుకోవడమేమి అత్యాశ కాదు! రైతులు ఆ మాత్రం కూడా అడగడం లేదు. కుటుంబ జీవనానికి అవసరమయ్యే కనీస మొత్తం తమకు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అదే కనీస మద్దతు ధర! స్వామినాథన్ కమిషన్ వాస్తవ ఉత్పత్తి ఖర్చుల మీద 50శాతాన్ని కనీస మద్దతుధరగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. దీనిని గ్యారంటీ చేయాలని, చట్టంలో పొందుపరచాలన్నది రైతుల డిమాండ్! అదే సమయంలో పండిన పంటను మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేస్తేనే మద్దతు ధర ఆచరణలో అమలు జరుగుతుందని రైతు నాయకులు చెబుతున్నది కూడా పూర్తి వాస్తవం. రైతాంగ ప్రయోజనాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా తీసుకుని తీరాల్సిన చర్య ఇది! ఈ పని చేయకుండా, చట్టం చేయం... ఉన్న చట్టంలోనూ చేర్చం! కావాలంటే రాతపూర్వకంగా ఇస్తాం, లేదంటే మరో కమిటీ వేస్తామంటూ చెబుతున్న మోడీ సర్కారు మాటల్లోని అంతరార్ధం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక రాష్ట్రం విషయానికి వస్తే, భరోసా కేంద్రాల ఏర్పాటుతో పాటు, కనీస మద్దతు ధరను కూడా ప్రకటించింది. ఈ ధరకు స్వామినాథన్ సిఫార్సు చేసిన ధరకు ఏ మాత్రం పొంతన లేదన్నది వేరే సంగతి! అయితే, ఆ అరకొర మద్దతు కూడా రైతాంగానికి దక్కడం లేదు. ప్రైవేటు దళారులకు కొనుగోలు మార్కెట్‌ను వదిలిపెడితే జరిగేది ఇదే. ప్రభుత్వమే పూనుకుని ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించడం జరిగినప్పుడే ప్రైవేటు వ్యక్తులు దారికొస్తారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్) అధికారంలో ఉన్న కేరళలో కనీస మద్దతు ధరను ప్రకటించడంతో పాటు, ఆ ధరకు ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 'బేస్ ప్రైస్' గా ఉండి మార్కెట్లో విక్రయాలకు రైతులకు వెసులుబాటు కల్పిస్తోంది. ఆహారపంటలకే కాకుండా 16 రకాల కూరగాయాలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించిన ఘనత కేరళ ప్రభుత్వానికి దక్కుతుంది. కేరళలో సాధ్యమైంది ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయమై దృష్టి సారించాలి. రైతులకు ఏది నిజమైన భరోసా ఇస్తుంది? హక్కుగా లభించే మద్దతు ధరా? దయా దాక్షిణ్యాలతో విదిల్చే రూపాయలా...! ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి!










