న్యూఢిల్లీ : రైతు ఆందోళనలపై ట్వీట్లు కొనసాగుతాయని ట్విటర్ సంస్థ మంగళవారం స్పష్టం చేసింది. స్వేచ్ఛగా బహిరంగంగా సమాచారం మార్పిడి చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందని తాము ధృడంగా విశ్వసిస్తున్నామని.. అందుకే ట్వీట్‌లు చేయడాన్ని కొనసాగిస్తామని ట్విటర్ ప్రకటించింది. రైతు నిరసనలకు సంబంధించిన 1,178 ఖాతాలను నిలిపివేయమన్న ప్రభుత్వ ఆదేశంపై ట్విటర్ మంగళవారం కేంద్రంతో సమావేశమైంది. మా సంస్థ ఉద్యోగుల భద్రతే అత్యంత ప్రధానమని.. ఈ నేపథ్యంలోనే అధికారిక సంప్రదింపుల కోసం సాంకేతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమావేశమయ్యామని ట్విటర్ తెలిపింది. తాము గౌరవప్రదమైన స్థానంలో ఉన్నామని.. అందుకే ప్రభుత్వంతో సమావేశమయ్యామని అన్నారు. ప్రభుత్వమిచ్చిన ఆదేశాలను పాటించమనే నోటీసును సమర్పించామని.. అలాగే ప్రభుత్వం కూడా ఆ ఖాతాలను నిలిపివేయాలన్న అధికారిక నోటీసును కూడా స్వీకరించామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, రైతుల ఆందోళనపై అసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. 1,178 ఖాతాలను నిలిపివేయాల్సిందిగా ఈ నెల 4న ప్రభుత్వం ట్విటర్ సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ.. పాప్‌సింగర్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా ధెన్‌బర్గ్‌లతో పాటు పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లను ట్విటర్ మేనేజర్ లైక్ చేయడం గమనార్హం.










