న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 1937లో తీసుకొచ్చిన మార్కెంటింగ్ పాలనతో పెద్ద పెద్ద మార్కెట్ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నామని గతంలో మన్మోహన్ సింగ్ అన్న వ్యాఖ్యలను మరోసారి ప్రధాని పేర్కన్నారు. మన్మోహన్ గారు ఇక్కడే ఉన్నారు. వ్యవసాయ చట్టాలపై యూ టర్న్ తీసుకున్నవారు.. ఈ వ్యాఖ్యలతోనైనా ఏకీభవిస్తారా అని మోడీ ప్రశ్నించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గురించి కొత్త అర్థాన్ని పేర్కొన్నారు. '' విదేశీ విధ్వంసకర భావజాలం '' నుండి దేశం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా ధెన్‌బర్గ్‌తో పాటు పలువురు ప్రముఖులు రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తుండటంతో.. మోడీ ఈ పదాన్ని ఉపయోగించారు. రైతులను చర్చలకు ఆహ్వావిస్తున్నామని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ దేశం సిక్కుల పట్ల గర్వంగా ఉందని.. అయితే సిక్కులు దేశం కోసం ఏమి చేయలేదని.. నిరసనకు వారే నాయకత్వం వహిస్తున్నారని ప్రస్తావించారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. ఈ రోజు సభలోనే వారిని ఆహ్వానిస్తున్నానని అన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఉందని, ఇకపై కూడా ఉంటుందని, కొనసాగుతుందని అన్నారు.










