Feb 08,2021 21:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపేయాలని, ఇళ్లకు వెళ్లిపోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సలహా ఇచ్చారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ సమాధానమిస్తూ, . రైతులు పెద్ద ఎత్తున చాలా రోజుల పాటు ఆందోళన సాగిస్తున్నారని, వారందరూ తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యమాన్ని ముగించి, ప్రభుత్వంతో చర్చకు రావాలని కోరారు. చర్చలకు రావాల్సిందిగా ఈ సభ నుంచే వారిని ఆహ్వానిస్తున్నానని అన్నారు. కనీస మద్దతు ధర ఉందని, ఇకపై కూడా ఉంటుందని, అందులో ఎలాంటి సందేహమూ లేదని మోడీ చెప్పారు. వ్యవసాయ చట్టాలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే, రైతులు అంధకారంలో మునిగిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, వెనుకబాట పట్టరాదని, ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలకు ఒక అవకాశం ఇవ్వాలని సూచించారు.
వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత గురించి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను మోడీ ఉటంకించారు. '1930లో తీసుకొచ్చిన మార్కెటింగ్‌ పాలన వల్ల పెద్ద పెద్ద మార్కెట్‌ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నామని మన్మోహన్‌ అన్నారు. దానికి ఆయన గర్వపడాలి. మన్మోహన్‌ గారు ఇక్కడే ఉన్నారు. వ్యవసాయ చట్టాలపై యూ టర్న్‌ తీసుకున్నవారు బహుశా ఆయన వ్యాఖ్యలతోనైనా ఏకీభవిస్తారేమో'' అని మోడీ వ్యాఖ్యానించారు. వ్యవసాయ సంస్కరణలపై ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ కూడా మాట్లాడారని, ఇప్పటికీ ఆయన సంస్కరణలకు ఏమాత్రం వ్యతిరేకి కాదని పేర్కొన్నారు. గతంలో లాల్‌బహదూర్‌ శాస్త్రి కూడా సంస్కరణలకు అనుగుణంగా అడుగులు వేసినప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయలేదంటూ మోడీ తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు వామపక్షాలు కాంగ్రెస్‌పై అమెరికా ఏజెంట్లంటూ విరుచుకుపడేవని, ఇప్పుడు కూడా వారే తనను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రపంచం మొత్తం భారత్‌ వైపు అత్యంత ఆశతో ఎదురుచూస్తోందని మోడీ అన్నారు. కొందరు కొత్తగా 'ఫారెన్‌ డిస్ట్రక్టివ్‌ ఐడియాలజీ' (ఎఫ్‌డిఐ)తో ముందుకు వస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.. ఈ తరహా వ్యక్తులకు దేశం తలగ్గరాదని అన్నారు. వాళ్లు ఎక్కడ, ఏ తరహా నిరసనలు జరిగినా అందులో దూరిపోతుంటారు. అది రైతుల నిరసనలు కావచ్చు, లాయర్లు, విద్యార్థుల నిరసనలు కూడా కావచ్చని అన్నారు. 'దేశంలో ఒక కొత్త తరహా ప్రజలు తలెత్తారు. వారు ఆందోళన జీవులు. వాళ్ల లైఫ్‌ సోర్స్‌ కేవలం నిరసనలు తెలపడమే. వాళ్లు ప్రతి నిరసన స్థలాల్లోనూ కనిపిస్తారు. నిరసనలు లేకుండా వాళ్లు జీవించలేరు. వాళ్లను మనం గుర్తించి వారి నుంచి దేశాన్ని కాపాడుకోవాలి' అంటూ ప్రధాని తన అక్కసు వెళ్లగక్కారు.

1178 ఖాతాలు బ్లాక్‌ చేయండి: ట్విట్టర్‌కు కేంద్రం హుకుం
'పాకిస్తాన్’, 'ఖలీస్తాన్‌' యూజర్లకు చెందిన 1178 ట్విట్టర్‌ ఖాతాలు బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అయితే దీనికి ట్విట్టర్‌ స్పందించలేదు.