ఒట్టావా : గ్రేటర్ టరంటో నుండి మెట్రో వాంకోవర్, కాల్గరీ వరకు ముఖ్యంగా కెనడా అంతటా.. ఇండో- కెనడియన్ వర్గాన్ని టార్గెట్ చేశారు. ఆ సమాజానికి చెందిన వారి కుటుంబసభ్యులపై లైంగిక వేధింపులు జరగవచ్చంటూ బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ వారు చేసిన నేరం .. భారత్‌లో కొనసాగుతున్న రైతు ఆందోళనల వెనుక గల కారణమేమిటని ప్రశ్నించడం.. ఖలిస్తానీయుల ప్రమేయం ఉందన్న వ్యాఖ్యలను తిరస్కరించడం.
బాధితుల్లో ఇద్దరు టరంటో శివారు ప్రాంతమైన బ్రాంప్టన్‌లో నివసిస్తున్నారు. వారు తమ పేర్లు చెప్పేందుకు నిరాకరించారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసిన అనంతరం వారంరోజుల్లో సుమారు 70 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని అన్నారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా బెదిరించారని అన్నారు. మరో వ్యకికి కూడా ఇతే తరహాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. పూర్తి పేరు చెప్పేందుకు నిరాకరించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ను షేర్ చేశారు. తన భార్య, కుమార్తెలను అత్యాచారం చేస్తానంటూ వారు బెదిరించారని అన్నారు. వీటిపై స్థానిక అధికారికి ఫిర్యాదు చేయగా, మరో వ్యక్తి ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కాగా, వారిద్దరి ఫిర్యాదుచేసినట్లు ఆ ప్రాంత పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాల్గరీకిచెందిన మరో వ్యక్తి వినరు మాట్లాడుతూ.. తనకు కూడా 100కు పైగా కాల్స్ వచ్చాయని.. కొందరు దుండగులు తన ఇంటిపై టమాటాలు, గుడ్లను విసిరికొడుతున్నారని అన్నారు. బెల్ కొట్టి వినరు ఎక్కడ అని అడుగుతున్నారని చెప్పారు. భారత్‌లో రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని మెట్రో వాంకోవర్ నివాసి అన్నారు.










