Nov 05,2023 11:24

ముంబయి :   ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీకి ఇటీవల బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ముకేష్‌ అంబానీ నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ.. ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ కేసును విచారించిని గాందేవి పోలీసులు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. నిందితుడిని గణేస్‌ రమేష్‌ వనపర్థిగా గుర్తించారు. అతడిని నవంబర్‌ 8వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీకి తరలించారు. ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత విచారణ జరుపుతున్నామని ముంబై సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. అక్టోబర్‌ 27న షాదాబ్‌ ఖాన్‌ పేరుతో ఈమెయిల్స్‌ వచ్చాయి. అంబానీ మాకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే మేము చంపేస్తామని, మా దగ్గర భారతదేశంలోనే అత్యున్నత షఉటర్లు ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ముకేష్‌ అంబానీ సెక్యూరిటీ ఇంఛార్జ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ రూ.20 కోట్ల డిమాండ్‌ తర్వాత ఇలాగే కొన్ని రోజుల తర్వాత రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తూ మరో బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. తర్వాత రూ. 400 కోట్లు చెల్లించాలని మరో ఈ మెయిల్‌ వచ్చాయి. అంతకుముందు కూడా ఇలాగే ముకేష్‌ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఇలాగే బెదిరిస్తూ కాల్‌ చేసిన బీహార్‌ కు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంబానీ నివాసం 'యాంటిలియా'ను పేల్చేస్తామని, రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటన్‌ ను పేల్చేస్తామని సదరు వ్యక్తి బెదిరించాడు.