Aug 28,2023 21:16
  • బ్లాక్‌రాక్స్‌తో కలిసి మ్యూచువల్‌ ఫండ్స్‌
  • బోర్డులోకి వారసులు

ముంబయి : బీమా రంగంలోకి ప్రవేశించనున్నట్లు రిలయన్స్‌ కంపెనీ ప్రకటించింది. సోమవారం జరిగిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ఆ సంస్థ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ ఈ విషయం తెలిపారు. ఆ గ్రూపు అనుబంధ సంస్థ జియో ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ (జెఎఫ్‌ఎస్‌) ద్వీరా బీమా వ్యాపారాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా బ్లాక్‌రాక్‌తో కలిసి మ్యూచువల్‌ ఫండ్స్‌ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. జెఎఫ్‌ఎస్‌తో సాధారణ, జీవిత, ఆరోగ్య బీమా రంగ ఉత్పత్తుల్లోకి ప్రవేశిస్తున్నామని, చౌక ధరలో బీమా పథకాలను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం గ్లోబల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని చెప్పారు. జెఎఫ్‌ఎస్‌లో రిలయన్స్‌ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిందన్నారు.

తప్పుకున్న నీతా అంబానీ

రిలయన్స్‌ ఇండిస్టీస్‌ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా చేస్తున్నారని ముకేష్‌ అంబానీ తెలిపారు. నీతా వైదొలిగినప్పటికీ ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత అహ్వానితురాలుగా ఉంటారన్నారు. తమ వారసులు ఈషా అంబానీ, ఆకాష్‌ అంబానీ, అనంత్‌ అంబానీలను రిలయన్స్‌ బోర్డులోకి కొత్తగా తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారన్నారు. మరో ఐదేళ్లు బోర్డు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ముకేష్‌ కొనసాగనున్నారు. రిలయన్స్‌లో ప్రస్తుతం న్యూ ఎనర్జీ రంగాన్ని చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, టెలికం విభాగాన్ని ఆకాష్‌కు, రిటైల్‌ వ్యాపారాన్ని ఇషా అంబానీ చూస్తున్నారు.

19న జియో ఎయిర్‌ ఫైబర్‌

వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్‌ 19న జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను ప్రారంభించనున్నట్లు ముకేష్‌ అంబానీ తెలిపారు. ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా రోజు 15వేల కనెక్షన్లు ఇవ్వగలమని, కానీ జియో ఎయిర్‌పైబర్‌ ద్వారా ఈ సంఖ్యను లక్షా 50 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించిన 5జి సేవలను ప్రస్తుతం దేశంలోని 96 శాతం పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు.