Nov 04,2023 13:14

న్యూఢిల్లీ :   ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ఆరోపణలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిచింది. ఈమేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. భూపేష్‌ బఘేల్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బిజెపి కుట్రలో భాగమే ఈ ఆరోపణలని మండిపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి రాష్ట్ర ప్రజలే తగిన సమాధానమిస్తారని ధీమా వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల కోడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది.

రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. బిజెపి ఈడి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, దీంతో ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతోనే బిజెపి రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతోందని ఎద్దేవా చేశారు. భూపేష్‌ బఘేల్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని మరో కాంగ్రెస్‌ నేత కె.సి. వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు భూపేష్‌ బఘేల్‌కు సుమారు రూ.508 కోట్లు చెల్లించినట్లు శుక్రవారం ఈడి ఆరోపించిన సంగతి తెలిసిందే.