Oct 18,2023 16:30

ప్రజాశక్తి - ఆలమూరు : ఆయనొక సాధారణ రైతు. తన ఇద్దరు బిడ్డలను ఉన్నత చదువులు చదివించి పలువురుకు ఆదర్శంగా నిలిచారు.  వివరాలు లోనికి వెళితే మండలంలోని మడికికి చెందిన సాధారణ రైతు కొత్తపల్లి గనిరాజుకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు డిగ్రీ వరకు చదివి వ్యవసాయంలో ఆ శాఖ అధికారులు సూచనల ప్రకారం  ఆధునిక వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచారు. అయితే చిన్న కుమారుడు కొత్తపల్లి వీరబ్బాయి ఇంజనీరింగ్ చదువులో పట్టా తీసుకొని రాజానగరంలో గల బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ విభాగాధిపతిగా మేనేజ్మెంట్ స్టడీస్ కు సహాయక అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతటితో ఆగకుండా కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగుల ఉత్పాదకతపై శిక్షణ, అభివృద్ధి, ప్రభావం వంటి అంశాలపై రాజమండ్రి  ఓఎన్జిసిలో అధ్యయనం చేస్తూ పరిశోధించారు. ఇందుకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరబ్బాయికి అరుదైన డాక్టరేట్ ను ప్రధానం చేసి సత్కరించారు. అలాగే ఇతనికి విశాఖపట్నం చెందిన బి.మురళీకృష్ణ గైడ్ గాను, ఎన్.సాంబశివరావు కో - గైడ్ గా వ్యవహరించారు. దీంతో వీరిని పలువురు నాయకులు అభినందించారు.