- రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్
ప్రజాశక్తి-జీలుగుమిల్లి : రైతుల కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు అందేలా మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలుగుమిల్లి మండలం పాములవారిగూడెంలో రైతాంగ సమస్యలపై కరపత్రాలు పంపిణీ చేసి ఆందోళన చేపట్టారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 1936 ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ దేశంలో జరిగిన అనేక రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర వహించిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతుల పంటలకు మద్దతు ధరలు కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, మండల నాయకులు బిక్కిన వీర సత్యం, సింహాద్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










