Oct 15,2023 12:47
  • రైతులకు సాగునీరు అందించాలి రైతు, కౌలు రైతు సంఘాల డిమాండ్

ప్రజాశక్తి-నందిగామ : కంచెల-వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని రైతు, రైతు సంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రైతు సంఘాల ప్రతినిధుల బృందం నందిగామ  మండలంలో అడవిరావులపాడు,లింగాలపాడు తక్కెళ్ళపాడు, బెల్లంకొండ వారి పాలెం, చెరువుకొమ్ముపాలెం గ్రామాలలో పర్యటించి రైతులను కలసి సాగునీటి ఎద్దడి గురించి విచారించటం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల మిర్చీ, పత్తి వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే మిర్చి రైతులు ఎకరానికి కౌలు తో కలిపి 80 వేల వరకు పెట్టుబడి అయిందని సాగునీటి వసతి లేక మిర్చి చేలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు మండలాల పరిధిలో 17 ఎకరాల సాగునీరు అందించే వేదాద్రి ఎత్తిపోతల పథకం గత నాలుగు సంవత్సరాలుగా పట్టించుకునే నాధుడు లేక మూలన పడిందని అన్నారు. ప్రభుత్వాలు మారిన వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మత్తులు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. తక్షణం వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు నిర్వహించి రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని అన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ తక్షణం చెర్వు మాదారం ట్యాంకు నుంచి సాగర్ జలాలు విడుదల చేసి మిర్చి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు యర్ర శ్రీనివాసరావు, రైతులు మార్కాపూడి స్వామి, మార్కపుడి గురవయ్య, సవలం వీరబాబు, సల్లారి బుజ్జి కోకాచందు తదితరులు పాల్గొన్నారు.