Feb 06,2023 16:24

వాషింగ్టన్  :   ప్రముఖ టెక్‌ కంపెనీ డెల్‌ టెక్నాలజీస్‌ కూడా ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. సుమారు 6,650 ఉద్యోగులను తొలగించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక సోమవారం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ శ్రామికశక్తిలో ఈ తొలగింపు 5 శాతం ఉండనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కంపెనీ పరిస్థితులు క్షీణిస్తున్నాయని.. దీంతో వ్యయ నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకోవలసివచ్చిందని డెల్‌ వైస్‌ చైర్మన్‌, కో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ పేర్కొన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం..2022 నాలుగవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్‌ల(పిసిల) పంపిణీ బాగా పడిపోయిందని ప్రముఖ మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ ఐడిసి ఐడిసి తెలిపింది. 2021లో ఇదే సమయంలో ప్రధాన కంపెనీలతో పోలిస్తే.. డెల్‌ 37 శాతం క్షీణత నమోదైంది. డెల్‌ కంపెనీ తన ఆదాయంలో 55 శాతాన్ని వ్యక్తిగత కంప్యూటర్‌ల ద్వారానే పొందుతోంది. డెల్‌ కన్నా ముందు హెచ్‌పి గత నవంబరులో 6,000 మందిని తొలగించగా, సిస్కో సిస్టమ్స్‌ 4,000 మందిపై వేటు వేసిన సంగతి తెలిసిందే.