- ఐఐఎఫ్‌సిఎల్ ప్రకటన శ్రీ జాబితాలో రామాయపట్నం, భావనపాడు శ్రీ బందరు పోర్టుకు 1,000 కోట్లు ?
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సిఎల్) దేశ వ్యాప్తంగా 20 పోర్టులకు 8.244 కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జాబితాలో రాష్ట్రానికి చెందిన మూడు పోర్టులు ఉన్నాయి. రామాయపట్నం, భావనపాడు పోర్టులతో పాటు మరో గ్రీన్‌ఫీల్డ్ నాన్‌మేజర్ పోర్టు ఉన్నట్లు ఐఐఎఫ్‌సిఎల్ వర్గాలు తెలిపాయి. మూడో పోర్టుపేరును ఆ వర్గాలు వెల్లడించకపోయినప్పటికీ బందరుపోర్టుగా భావిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తొలిదశను 30నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'సంవత్సరానికి 30 మిలియను టన్నుల సామర్ధ్యం (ఎంటిపిఎ)తో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు 1,000 కోట్ల రూపాయల రుణం మంజూరైంది' అని ఆ వర్గాలు తెలిపాయి. బందరు పోర్టు తొలివిడత ప్రతిపాదిత సామర్ధ్యం కూడా 30 ఎంటిపిఎ కావడం గమనార్హం. అయితే, ఈ పోర్టుకు సంబంధించిన వివాదం కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పోర్టు పేరును గోప్యంగా ఉంచిఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామాయపట్నం, భావనపాడు పోర్టులకు ఎంత మొత్తం రుణం మంజూరైందన్న విషయాన్ని కూడా ఐఐఎఫ్‌సిఎల్ వర్గాలు తెలపలేదు. రాష్ట్రంలో ఇప్పటికే వైజాగ్ పోర్టులోని ఎస్సార్ టెర్మినల్‌కు, కృష్ణపట్నం పోర్టుకు ఐఐఎఫ్‌సిఎల్ రుణం ఇచ్చింది.
- 2023 చివరికి రామాయపట్నం
రామాయపట్నం పోర్టు 2023 చివరికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పోర్టులోని నాలుగు బెర్తుల పనులు పూర్తికానున్నాయి. 34 ఎంటిపిఎ సామర్ధ్యంతో ఈ పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తుందని సమాచారం. రామాయపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కనెక్టివిటి పెరగడంతోపాటు, రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని ఐఐఎఫ్‌సిఎల్ ఎండి పి.ఆర్ జైశంకర్ పాత్రికేయులకు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన భావనపాడుతో పాటు మరో ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. రానున్న కొద్ది సంవత్సరాలలో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, అప్పుడు దేశీయ కార్గో సామర్ధ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని పోర్టులకు కలిపి 2,600 ఎంటిపిఎ కార్గొ సామర్ధ్యం ఉంది. వీటిలో 12 మేజర్ పోర్టుల సామర్ధ్యం 1,598 ఎంటిపిఎ. ప్రస్తుతం ఐఐఎఫ్‌సిఎల్ రుణం అందిస్తున్న అన్ని పోర్టులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరో 1,000 ఎంటిపిఎ మేర కార్గో సామర్ధ్యం పెరుగుతుందని అంచనా.










