శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూములను బలవంతంగా తీసుకుని కార్పొరేట్లకు అప్పజెపితే సహించేది లేదని సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు హెచ్చరించారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో భావనపాడు పోర్ట్ ప్రభావిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో పి.మధు పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు పి.మధు మాట్లాడుతూ ... భావనపాడు పోర్టు పేరుతో ప్రజల ఆమోదం లేకుండా బలవంతంగా చేపట్టే భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసు నిర్బంధాన్ని ఉపయోగించి ఇల్లు కొలతలు వేయడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టును వ్యతిరేకించిన వైసిపి, ఇప్పుడు పోర్టు కడతామని చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భావనపాడు పోర్టు రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు పాల్గొన్నారు.










