Oct 25,2023 12:16

మరికల్‌ (నారాయణపేట) : దసరా పండుగ అంటే పల్లెలే గుర్తొస్తాయి.. ఆ గ్రామాల్లో జరిగే సంబరాలు, సందడ్లు, ఆటపాటలు, పిండివంటలు, కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు... ఇలా ఎన్నో...! ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండే వారంతా సొంతూరుకు ప్రయాణమై వస్తారు. తమ సొంతూళ్లల్లో సందడి చేస్తారు..! ఈ ఏడు దసరా అన్ని రాష్ట్రాల్లోనూ సంబరంగా జరిగింది. కానీ... మూడు గ్రామాల్లో మాత్రం నిర్మానుష్యమయ్యింది.. పండు ముసలివారికి బుక్కెడు బువ్వ కరువయ్యింది..! ఎందుకంటే...

అప్పటి నుండి....
ఇథనాల్‌ కంపెనీ చిచ్చుకు .. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని మూడు గ్రామాలకు దసరా పండుగ పీడకలలా మారింది. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్‌ పూర్‌ గ్రామస్థులను అల్లకల్లోలం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన ఎక్లాస్‌ పూర్‌ గేట్‌ వద్ద చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్రామాల ప్రజలు, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసు వాహనాలు ధ్వంసం జరగగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతే... ఆందోళన అనంతరం అయా గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అర్థరాత్రుల్లు గ్రామాల్లో పోలీసు బూట్లు చప్పుడ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రులు పోలీసు బూటు చప్పుళ్ళు గ్రామ ప్రజలను అడవి, పంటపొలాల బాటకు పరుగులు పెట్టించాయి. ఘటన జరిగిన వీడియోలను పరిశీలిస్తూ ఆందోళనలో పాల్గొన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 20మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

మూడు ఊళ్లు ఖాళీ...!
ఇథనాల్‌ కంపెనీ చిచ్చుకు... హడలెత్తిస్తున్న పోలీసుల బూట్లచప్పుళ్లకు ఆ మూడు ఊళ్లు ఖాళీ అయ్యాయి. చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్‌ పూర్‌ గ్రామాల్లో దసరా పండుగ లేదు. గ్రామస్థులు ఊరిని ఖాళీ చేసి అడవులకు, తమ బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ముసలివారు తప్ప ఇంకెవరు కనిపించడం లేదు. పండుగ పూట బుక్కెడు ముద్దకు దూరమయ్యామని ఆ వృద్దులు కంటతడిపెట్టారు. పోలీసుల చర్యలతో ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం, విద్యనభ్యసించే వారు కూడా గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారినా.. ఇథనాల్‌ కంపెనీని తరలించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని అన్నదాతలు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు.