గొల్లగూడెం గ్రామంలో నీట మునిగిన ప్రజలను పరామర్శించిన సిపిఎం బృందం

విఆర్.పురం (అల్లూరి) : శబరి గోదావరి సంగ్రామంలో మండలంలోని గొల్లగూడెం గ్రామాన్ని నీటమునిగిన ప్రజలను సిపిఎం బృందం నేతలు ఆదివారం పరామర్శించారు. నిర్వాసితులు మాట్లాడుతూ ... ఓవైపు గోదావరి శబరి నదులు పొంగుతూ మరోపక్క కరెంటు లేక ఇల్లు నీట మునిగి ఉండటంతో ఎటునుంచి విషపురుగులు వస్తాయేమోనని బిక్కుబిక్కుమంటూ రాత్రి గడిపామని అన్నారు. ఇళ్లు మునగడంతో ఇంట్లో సామాన్లను ఎత్తు ప్రదేశం రహదారివైపు పెట్టుకొని ఉన్నామని అన్నారు. ఇంతవరకు అధికారులు వచ్చి తమ బాధలను చూడలేదని వాపోయారు. ప్యాకేజీ ఇచ్చి ఇక్కడ నుంచి తమను పంపించాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ ... ప్రభుత్వం తక్షణమే ఈ గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గూటాల శ్రీనివాసరావు, ప్రకాష్ రావు, చందర్రావు, నిర్వాసితులు పాల్గొన్నారు.