
- వ్యవసాయ రంగంపై సుందరయ్యకు లోతైన అవగాహన
- పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాసంలో ప్రకాష్ కరత్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామాల్లో దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ (హెచ్‌కెఎస్) భవన్‌లో పి.సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాస కార్యక్రమం ట్రస్ట్ డైరెక్టర్ బోర్డు సభ్యులు, ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ దావలే అధ్యక్షతన జరిగింది. వ్యవసాయ సమస్యలకు పి. సుందరయ్య రచనలు, దాని సమకాలీన ఔచిత్యంపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడా భూ యజమానులతోపాటు ధనిక దోపిడీదారులకు వ్యతిరేకంగా చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత కార్మికులతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉపాధి, వేతనాలు, జీవనోపాధి, లింగ వివక్ష, కుల వివక్ష తదితర గ్రామీణ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సుందరయ్యకు దేశ వ్యవసాయ సంబంధాలపై లోతైన అవగాహన ఉంది. 1964లో పార్టీ కార్యక్రమంలో వ్యవసాయ భాగం రూపొందించబడిందని, 1967లో కేంద్ర కమిటీ రైతు రంగంలో విధులను ఆమోదించిందని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని రెండు తీరప్రాంత గ్రామాల రైతుల స్థితిగతులను అధ్యయనం చేసే కరపత్రాన్ని సిద్ధం చేశారని అన్నారు. మార్క్సిస్టు దృక్పథంతో వ్యవసాయ సంబంధాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో చాలా ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన అనేక నివేదికలు అందించారని తెలిపారు. ప్రతి ప్రాంత భౌగోళిక లక్షణాలను అర్థం చేసుకోవడానికి సుందరయ్య అనేక మ్యాప్‌లను కూడా సేకరించారని అన్నారు.
నయా ఉదారవాద సంస్కరణలు, గుత్తాధిపత్యం ఫలితంగా సుందరయ్య కాలం నుండి గ్రామీణ పరిస్థితులు, వ్యవసాయ సంబంధాలు పెద్ద మార్పుకు గురయ్యాయని అన్నారు. ప్రస్తుతం పెద్ద రైతులకు, భూ యజమానులకు భూమిపై వచ్చే ఆదాయం ఒక్కటే కాదని, అనేక ఇతర ఆదాయ వనరులు ఉన్నాయని అన్నారు. చిన్న రైతులు, రైతు కూలీల్లో మార్పు వచ్చిందని, వ్యవసాయ కూలీల్లో అధిక శాతం వలస కార్మికులుగా మారారని పేర్కొన్నారు. నగరాల నిర్మాణ రంగంలో వారు విస్తృతంగా ఉపాధి పొందుతున్నారని, కానీ వారు గ్రామీణ బంధాలను పూర్తిగా వదులుకోలేదని అన్నారు. మారిన ఈ పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో ధనిక వర్గానికి వ్యతిరేకంగా కొత్త ఉద్యమాలు చేపట్టాలని కరత్ అన్నారు. ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ దావలే మాట్లాడుతూ ప్రస్తుత రైతు ఉద్యమానికి పి.సుందరయ్య దిక్సూచి అని అన్నారు. భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో తెభాగ, కేరళలో పున్నప్రావాయలార్, నార్త్ మలబార్ ఉద్యమం, మహారాష్ట్రలో వర్లీ ఆదీవాసీ పోరాటం, త్రిపుర గణ ముక్తి పరిషత్ పోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ ఉద్యమం జరిగాయన్నారు. ఈ పోరాటాలకు క్లైమాక్స్ గా తెలంగాణ సాయుధ పోరాటం నిలిచిందన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై ఆయన రచనలే గొప్ప వారసత్వమని అన్నారు. అందరూ వాటిని స్టడీ చేయాలని సూచించారు. నయా ఉదారవాద విధానాల అమలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రచనలు చదవాల్సిన అవసరముందన్నారు. రైతు ఉద్యమం, వ్యవసాయ పరిస్థితులు అర్థం చేసుకోవడం, ప్రభుత్వ విధానాలు వంటి పరిశోధనలకు సహకరించే విధంగా 2014లో ఈ ట్రస్ట్ ను ప్రారంభించామని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పి.సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు హన్నన్ మొల్లా, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.