
సుందరయ్య గారు తన ఆత్మకథలో పేర్కొన్న 'అజ్ఞాత వ్యక్తి' మానాన్నే. ఫాదర్స్ డే లు మదర్స్ డే లు అనేవి మేము పాటించంగానీ.. అప్పుడు నాన్నలు ఎలా ఉండేవారో నేటి తరానికి తెలియాలి. అందుకే మా నాన్న గురించి కొన్ని విషయాలు చెప్పాలనేదే నా ఈ ప్రయత్నం. నాడు వాళ్లు చేసిన త్యాగాలు నేటి తరం తెలుసుకోవాల్సి ఉంది. నేడున్న పరిస్థితుల్లో మళ్లీ నాడు చూపించిన తెగువ, స్ఫూర్తి నేటి తరం అందిపుచ్చుకోవాలి. ఈ సందర్భంగా ఇదే నాన్నకి నేనిచ్చే అక్షర నివాళి.
మా నాన్న గోపిశెట్టి వెంకయ్యగారు.. తాతగారు సుందరరామయ్యగారు. కృష్ణ అవతల గుంటూరు జిల్లాలో అమరావతి పక్కనే తాడువాయి అనే గ్రామం నానమ్మ వెంకటసుబ్బమ్మది. నాన్న ఇంగ్లీషు మీడియంలో చదువుకొన్నారు. ఆయన ఫారెస్ట్ డిపార్టుమెంటులో పెద్ద ఉద్యోగంలో వున్నారు. అయితే తన మేనమామ కోరికపై దుగ్గిరాలపాడుకు వచ్చారు. ఆయన తన మునసబు ఉద్యోగాన్ని మా నాన్నకి వారసత్వంగా ఇచ్చారు. అలా నాన్న మంచి ఉద్యోగాన్ని వదులుకొని, మునసబుగా కృష్ణాజిల్లా దుగ్గిరాలపాడులో స్థిరపడిపోయారు.
- కమ్యూనిస్టు భావాలతో..
ఉద్యోగమేదయినా ఆయన కమ్యూనిస్టు భావాలతో పెరిగారు. సామ్యవాద సిద్ధాంతం పట్ల విశ్వాసంతో ఉన్నారు. నాన్నగారి వివాహ సమయానికే తెలంగాణా విముక్తి పోరాటం కొరకు సన్నాహాలు మొదలయ్యాయి. అనేకమంది ప్రముఖ కమ్యూనిస్టులతో చర్చలలో పాల్గొనేవారు. ఉద్యమం తీవ్రమయిన కొలదీ రహస్యదళాలు ఏర్పడినాయి. మావూరికి ఆనుకొనే వున్న అడవిలో వారికి ట్రైనింగ్ ఇచ్చేవారు. పార్టీ పెద్దలందరూ దాదాపుగా మా ఇంట్లోనే అజ్ఞాతంగా వుండేవారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కనుక బైటకు తెలియనిచ్చేవారు కాదు. వండి పెట్టడమేగాని, వచ్చినదెవరో మా అమ్మకు కూడా తెలియనిచ్చేవారు కాదుట. మళయాళ పోలీసులు కానీ, సిఐడీలు కానీ మా ఇంటి వరకే వచ్చేవారట. లోపలకు రావడానికి పర్మిషన్ లేదట. కనుక లోపలున్న విషయం తెలియకుండా కాపాడారట. ఇంట్లోనే మీటింగ్స్ ఏర్పాటు చేసేవారు. పెద్ద పెద్ద నాయకులు ఆ మీటింగ్‌లకు హాజరయ్యేవారు. సమాచారం చేరవేసే కీలకమైన పని (కొరియర్‌లా) నాన్న చాలా సమర్ధవంతంగా చేశారు.

ఒకసారి అన్నమూ, కూరలు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా రెండుబుట్టలలో పెట్టుకొని, పైన గడ్డి కప్పి, కావడిని తీసుకుని నాన్న అడవికి వెళ్ళారట. అక్కడ వున్న దళం సభ్యులకు మూడురోజులుగా ఏమీ తినడానికి వీలుకాలేదట. వచ్చిన విషయం సుందరయ్యగారు కబురు చేస్తే నాన్న తీసుకెళ్ళారట. సుందరయ్యగారికి అప్పటికే పళ్ళ నుండి రక్తం వచ్చేదట. అందుకుని అమ్మ ఆయన కోసం మెత్తగా వండిన అన్నమూ, మెత్తగా చేసిన కైమా కూరను విడిగా పెట్టి 'మా సుందరయ్య అన్నయ్యకి ఇది ఇవ్వండి!' అని చెప్పిందట. కానీ అక్కడ ఆకలితో ఉన్న దళ సభ్యులు ఆగలేక అన్నీ తీసేసుకుని, తినేస్తుంటే నాన్న ఆపబోయారట. కానీ సుందరయ్యగారు ఇచ్చేశారట. అందరూ తిన్నాక సుందరయ్యగారు తినడానికి కొంచెం అన్నం మాత్రమే వుందట. ఏ కూరలూ లేవట. ఆయన ఆ అన్నమే తింటూ, ''బావగారూ, అనుకుంటాముగానీ తినగా తినగా వట్టి అన్నము కూడా చాలా రుచిగా వుంటుందండి.. చూడండి..'' అన్నారట. నాన్న ఏం అనలేక మౌనంగా ఉండిపోయారట. ఇంటికి వచ్చాక అమ్మ అడుగుతుంటే చెప్పారిలా జరిగిందని.. అమ్మయితే కళ్ళనీళ్ళు పెట్టుకొంది. ఇలాంటి అనుభవాలెన్నో చెప్తుంటే నేనలా వింటుండేదాన్ని.
సుందరయ్య గారు తన ఆత్మకథలో 'అజ్ఞాత వ్యక్తి' అని పేర్కొన్నది మా నాన్నగారి గురించే. నాన్న ప్రభుత్వోద్యోగిగా ఉన్నందున ఇబ్బందవుతుందని అలాంటివారి సహకారం ఇంకా చాలా అవసరం ఉన్న నేపథ్యంలో పేరు రాయలేదని సుందరయ్యగారే నాతో స్వయంగా చెప్పారు.
- అజ్ఞాతానికి ఆవాసం..
ఉద్యమకారులపై ''షూట్ ఎట్ సైట్'' అమలులో వుంది. ఒకసారి మా బాబాయి మాచినేని వెంకటేశ్వరరావుని కోళ్లగంప కింద ఉంచి, పైన గోనెలు కప్పారట. ఇంటిముందు మిలిటరీ వారి అడుగుల శబ్దం విని, భయపడి వెనుక నుండి పారిపోయి, అడవి ప్రక్కన చెరువులో చెట్ల మధ్య కూర్చున్నాడట. వాళ్ళు వెళ్ళిపోయాక నాన్న బాబాయి కొరకు వెదికితే, ఒక మైలు దూరంలో దొరికాడట. 'ఏం పనిరా ఇది. నీకేమయింది? ఎందుకిలా చేశావ్? ఎవరైనా చూస్తే కాల్చేసేవారు కదా?' అని బాగా కోప్పడ్డారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. కొన్ని వేలమందిని పోగొట్టుకున్నాక.. పోరాటం ఆగిపోయింది. అందులో మా మేనమామ బెల్లపు శోభనాద్రిగారొకరు.
ఊరు అడవి దగ్గర ఉన్నందున ఆయన తుపాకీని ఎక్కువగా వాడాల్సి వచ్చిందట. లైసెన్స్ ఉన్న తుపాకీ కనుక ప్రభుత్వానికి ఏ విధమైన ఆక్షేపణ లేదు. అయినా ఊరిని అడవికి దూరంగా రైల్వేట్రాక్ పక్కకు మార్చారట. నాన్న హోమియో వైద్యం చేసేవారు. స్వంత డబ్బులతో విజయవాడలో మందులు తెచ్చి, ఇంట్లో వుంచేవారు. వాటితోపాటు, దూది, టించరు అయోడిన్ లాంటివి కూడా అందుబాటులో వుంచేవారు. ఎవరికైనా దెబ్బలు తగిలితే సెప్టిక్ కాకుండా ఆ మందులు ఉచితంగానే.వాడేవారు. కొంతమంది స్త్రీలు ప్రసవించలేక ఇబ్బందిపడేవారు. నాడు సరైన వైద్య సదుపాయాలు లేవు. విజయవాడ, లేదా కొండపల్లి వెళ్ళాలి. రవాణా సౌకర్యాలూ లేవు. అసలు రోడ్లే లేవు. అలాంటప్పుడు నాన్నగారు ప్రసవించే వారికి కొద్దిగా దగ్గిరలో కనపడకుండా గన్ పేల్చేవారు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి, వాళ్లు ప్రసవించేది. అలా రెండు మూడు సార్లు నేను కూడా నాన్నతోనే వెళ్లాను.
- భావజాల వారసత్వం..
వ్యవసాయం దెబ్బతినడం, అప్పులు చేసినా తీర్చేదారి లేదు. మునసబు ఉద్యోగం దోచుకొనే వారికేగాని మానాన్నలాంటి వారికి సరైనది కాదు. గౌరవమేగానీ జీతాలు చాలా తక్కువ. వచ్చేపోయే అధికారులతో ఖర్చులు మాత్రం జాస్తి. విలువలకు కట్టుబడి జీవితమంతా కష్టాలే అనుభవించారు. ప్రతిఫలాపేక్ష లేకుండా సాయం చేయడం నాన్న నైజం. ఆయన 1979, జూన్ 28వ తేదీన.. 67 ఏళ్ళ వయసులోనే, మా వూరిలో మరణించారు. అమ్మానాన్నల పేరు మీద, ఊరి మొగదల ఒక బస్టాండ్‌ని, ఆయన శతజయంతి సందర్భంగా నిర్మించుకున్నాం. అమ్మానాన్నల భావజాల వారసత్వం ఆయన పిల్లలమైన మేము, మా తర్వాత మా పిల్లల్లోనూ, వారి పిల్లల్లోనూ ఆ భావాలు కొనసాగుతూనే వుంటాయి.
- ఫాదర్స్‌డే మొదలైంది ఇలా...!
ఫాదర్స్‌డే తొలిసారి అమెరికాలో 1910 జూన్‌లో మొదలైంది. సోనారా లూయీస్ అనే అమ్మాయికి వచ్చిన ఆలోచన. తన 16 ఏళ్ల వయసులో తల్లి చనిపోవడంతో, తండ్రే అన్నీ తానై, పిల్లల్ని ఎంతో బాధ్యతతో పెంచాడు. ఎన్ని కష్టాలొచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని, ప్రేమతో పెంచాడు. తన తండ్రి కష్టాల్ని చూసిన సోనోరా లూయీస్, తల్లులకంటూ ఓ రోజు ఉంది, మరి తండ్రులకూ ఓ రోజు ఉండాలి అనుకుంది. ప్రభుత్వానికి తన ప్రతిపాదన పంపింది. మొదట అమెరికా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, ఆ తర్వాత ఎట్టకేలకు ఒప్పుకుంది. ఆ మేరకు జూన్ మూడో ఆదివారాన్ని 'ఫాదర్స్ డే'గా ప్రకటించారు.
ప్రపంచంలో అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, అర్జెంటీనా, ఫ్రాన్స్, గ్రీస్, ఐర్లాండ్, మెక్సికో, సింగపూర్, సౌతాఫ్రికా, వెనెజులా, ఇండియా, పాకిస్తాన్ వంటి అనేక ఇతర 111 దేశాల్లో ఒకేరోజున జరుపుకుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం సెప్టెంబర్ మొదటి ఆదివారం జరుపుకుంటారు. మెక్సికోలో ప్రతి ఏడాది ఇదే రోజున 21 కిలోమీటర్ల మేర మారథాన్ నిర్వహిస్తారు. జపాన్‌లో పిల్లలు ఇంట్లో తయారుచేసిన వస్తువులతో తండ్రులకు గిఫ్ట్‌లు ఇస్తారు. థారులాండ్‌లో డిసెంబర్ 5న, రష్యాలో ఫిబ్రవరి 23న, ఇటలీలో మార్చి 19న జరుపుకుంటారు.
- గోపిశెట్టి స్వతంత్ర భారతి
ఫోన్ : 9247845678