
- శాస్త్రీయ దృక్పథంతో మానవ సంబంధాల విశ్లేషణ
- ఆచార్య కేతు విశ్వనాథ్‌రెడ్డి ప్రస్థానం
ప్రజాశక్తి- కడప అర్బన్ : కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి తెలుగు సాహిత్యంలో కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులు. జి.ఎన్.రెడ్డి. పర్యవేక్షణలో కడప జిల్లా గ్రామ నామాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆయన మొదటి నుంచి తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి శాస్త్రీయ దృక్పథంతో మానవ సంబంధాలను విశ్లేషించి రచనలు చేశారు. గ్రామ నామాలపై లోతైన, విశిష్టమైన పంథాలో పరిశోధించారు. గ్రామాల పేర్లను, ఆ గ్రామాల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను, ఆర్థిక అసమానతలను పరిశీలించి వెలువరించిన అధ్యయన ఫలితాలు ప్రశంసలు పొందాయి. ఈ పరిశోధనలు ఆ తర్వాత తరాలవారికి మార్గదర్శకమైన అనేక నిఘంటువుల రూపకల్పనకు దారితీసింది. తాను పుట్టిన నేల, పెరిగిన సమాజం ఈ రెండింటినీ ప్రధాన వస్తువుగా చేసుకుని అద్భుతమైన కథలను రాశారు. ముఖ్యంగా సామాన్యుల జీవితాల్లో సంభవించే అన్ని కోణాలనూ మార్క్సిస్టు దృక్పథంతో తనదైన శైలిలో ఆవిష్కరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న దయనీయ స్థితిగతులు, వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలు, పట్టణాల్లో డొల్లతనం, రాయలసీమ ప్రజల్లో అభద్రతా భావన, ఫ్యాక్షన్ సమస్య, గ్రామ పెద్దలు విద్వేషాలతో రెచ్చగొట్టే విధానం, కుల, మత ద్వేషాలు తదితర అంశాలన్నీ ఆయన కథల్లో యథాతథంగా మనకళ్లముందు నిలబెట్టి జీవిత వాస్తవికతను చూపెట్టారు. 1958లో కడప ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లో ప్రారంభమైన ఆయన కథా సాహిత్యం నిన్న మొన్నటి వరకు అవిశ్రాంతంగా కొనసాగింది. తొలినాళ్లలో ఆయన వ్యాసాలు, నాటకాలు, నాటికలు రాసినా తెలుగు సాహిత్యలోకంలో కథకునిగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. మంచి పాఠకుడిగా, విద్యార్థిగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, పాత్రికేయుడిగా, బహుశాస్త్రవేత్తగా, కథకుడిగా, విమర్శకుడిగా అనేక ప్రక్రియల్లో గణనీయమైన కృషి చేశారు. 1986లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే డాక్టర్ వైఎస్‌ఆర్ జీవిత సాఫల్య పురస్కారం 2021లో లభించింది. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి సలహామండలి సభ్యులుగా ఆయన ఆలోచనలు, సూచనలు, సలహాలు సంస్థ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆయన మృతి తెలుగు రాష్ట్రాల సాహితీమిత్రులకు తీరని వెలితని పలువురు పేర్కొన్నారు.
నేడు కడపకు 'కేతు' భౌతికకాయం
కేతు విశ్వనాథరెడ్డి పెద్ద కుమార్తె మాధవి ఒంగోలులో ఉంటున్నారు. కుమారుడు శశినాథ్‌రెడ్డి, చిన్న కుమార్తె శిరీష అమెరికాలో ఉంటున్నారు. కేతు భౌతికకాయం ఒంగోలులోని కూతురు ఇంటి నుంచి మంగళవారం మధ్యాహ్నం కడపకు తీసుకురానున్నారు. కడప నగర శివారులోని సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఆయన సొంత ఇల్లు 'ఆపేక్ష' వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు, కుమార్తె మంగళవారం అక్కడి నుంచి బయలుదేరి బుధవారం కడప చేరుకోనున్నారు. కేతు సొంతూరైన రంగసాయిపురానికిి భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు.
భర్త మృతి విషయం భార్యకు తెలియనివ్వకుండా రహస్యంగా...
కేతు భార్య పద్మావతమ్మకు ఒంగోలులోని సంఘమిత్ర ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన పరీక్షలు ఆదివారం జరిగాయి. ఈ నేపథ్యంలో కడప నుంచి ఒంగోలుకు విశ్వనాథరెడ్డి వచ్చారు. ఆదివారం రాత్రి ఒంగోలులోని తన అల్లుడు ఇంట్లో ఆయన ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున అల్లుడిని లేపి ఊపిరాడడం కష్టంగా ఉందని చెప్పారు. వెంటనే ఆయనను సంఘమిత్ర ఆస్పత్రికి అల్లుడు తీసుకెళ్లారు. డాక్టర్లు కేతును వెంటిలేటర్ మీదకు చేర్చే సరికే మృతి చెందారు. అదే ఆస్పత్రిలో గుండె పరీక్షలు చేయించుకొని చికిత్స నిమిత్తం ఆమె భార్య పద్మావతమ్మ ఉన్నారు. భర్త మరణ వార్త తెలియజేస్తే ఏమవుతుందన్న బెంగతో ఆమెకు ఈ విషయం తెలియనీయకుండా కుటుంబసభ్యులు జాగ్రత్త వహించారు.