- దళితుల సాగుభూమిని వదల్లేదు
- మైనింగ్ మాఫియా అక్రమాలు
- వలంటీర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- ప్రజాశక్తి పరిశీలనలో వెల్లడి
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా సైదాపురంలో మైనింగ్ మాఫియా అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తహసిల్ధార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. రెవిన్యూభూముల్లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను పెరికి పారేశారు. దళితులు ఏళ్లతరబడి సాగుచేసుకుంటున్న భూముల్లోంచి వారిని తరిమేసి తవ్వకాలు జరిపారు. ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసిన టన్నుల కొద్ది తెల్లరాయి పడిఉంది. గురువారం ఈ ప్రాంతంలో పరిశీలన చేసిన ప్రజాశక్తికి కనిపించిన దృశ్యాలివి! కుప్పలుగా పడిఉన్న తెల్లరాయిని అధికారులు ఇంతవరకు స్వాధీనం చేసుకోకపోవడంపై స్థానికంగా చర్చ సాగుతోంది. ó భూమి ఎవరిదైనా సరే
తవ్వేశారని స్థానికులు తెలిపారు. ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వరని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఆ విషయం అక్రమార్కులకు తెలిసిపోతోందని తెలిపారు. సైదాపురం మండలం అంతా కొండలు, గుట్టలు, మెట్ట భూములు, పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. వీటిలో అధికభాగం మాఫియా బారిన పడింది. ప్రస్తుతం అక్కడ శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. సైదాపురం తహశీల్దారులు కార్యాలయానికి కేవలం 100 మీటర్లు దూరంలోని సర్వే నెంబర్ 528, 528బి, 522బి లలో విచ్చలవిడిగా తవ్వకాలు జరిగాయి. సమీపం లోని దేవర తిప్పను మాఫియా మిగతా 2లో గుల్లగుల్ల చేసింది. హిటాచీలతో ఎక్కడికక్కడే తవ్వకాలు చేసి, రాయిని తరలించింది.
ఫిర్యాదు చేసినా...!
తహసిల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో జరిగిన ఈ తవ్వకాలపై ఫిర్యాదు అందినా అధికారయంత్రాంగం స్పందించలేదని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక వలంటీర్లు, సచివాలయ కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని అనేక దఫాలు రెవిన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. ఈ తరహా ఫిర్యాదులు అందినప్పుడల్లా ఇదిగో..అదిగో అంటూ దాటేశారని కనీస చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు.
బోర్డులు పీకేసి.. కొండలు తవ్వేసి
సర్వేనెంబర్ 793, ముక్కోటి కొండలలో రెవెన్యూ భూమి 114 ఎకరాలుంది. ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవిన్యూ అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డును పీకి పడేసి కొండ మొత్తాన్ని తవ్వేశారు. బోర్డు ఉన్న స్థలంలో ప్రస్తుతం పెద్దగొయ్యి కనపడుతోంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు ఇక్కడ 42 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఈ భూముల్లో తవ్వకాలు చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని తెలిసింది. ఏ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.