తెనాలి టౌన్ : తన తల్లిని, చెల్లిని, తనను నమ్మించి గోదావరి నదిలోకి నెట్టేశాడని బాలిక కీర్తన (13) కన్నీరుపెట్టుకుంటూ .... మీడియా ముందు వివరాలు వెల్లడించింది. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాత వంతెన వద్ద వివాహిత, ఇద్దరు పిల్లలను గోదారిలో తోసేసిన ఘటనలో .... ప్రాణాలతో బయటపడిన కీర్తనను తెనాలిలోని ఆమె పెద్దమ్మకు అధికారులు అప్పగించారు. మంగళవారం అక్కడికి వెళ్లిన విలేకరులతో బాలిక మాట్లాడుతూ.....
వారిది తాడేపల్లి అని, తన తల్లి ఎంసీఏ చదివి కొన్ని కారణాల వల్ల హౌటల్‌లో గ్రైండర్ వద్ద పని చేసేదని చెప్పింది. అక్కడే సురేష్ అనే వ్యక్తి 2018లో తన తల్లికి పరిచయం అయ్యాడనీ, అప్పటి నుంచి కలిసి ఉంటున్నారని తెలిపింది. గత ఏడాది ఆగస్టులో తనకు చెల్లెలు పుట్టిందని, తర్వాత అతను అమ్మను పట్టించుకోవడం మానేశాడని, గొడవలు జరిగాయని బాలిక వాపోయింది. తాము తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టామని తెలిపింది. గొడవల నేపథ్యంలో ... ఈ నెల 5వ తేదీన తాను కారు కొన్నానని, సరదాగా వెళ్లివద్దామని సురేష్ అమ్మకు మాయమాటలు చెప్పి నమ్మించాడని, అందరం బయలుదేరి వెళ్లామని బాలిక తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున రావులపాలెం వద్ద సురేశ్ గోదావరి వద్దకు తీసుకెళ్లి తన తల్లిని, చెల్లిని, తనను గోదావరిలోకి తోసేశాడని, అమ్మ, చెల్లి నదిలో పడిపోయారని బాలిక కంటతడిపెట్టింది. తన చేతికి పైపు తగలడంతో అది పట్టుకున్నాననీ, తన వద్దనున్న ఫోన్‌తో 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి రక్షించారని బాలిక వివరించింది.