- అదనపు ఆయకట్టు లక్ష్యం 1.46 లక్షల ఎకరాలు
- అందింది 71 వేల ఎకరాలకే
- శివారు భూములకు చేరని నీరు
- ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగునీటి ప్రదాయినిగా చెప్పుకుంటున్న సర్థార్ గౌతు లచ్చన్న సాగు నీటి జలాశయం నీరు అదనపు ఆయకట్టుకు లక్ష్యానికి అనుగుణంగా అందడం లేదు. ముఖ్యంగా శివారు భూములకు పరిస్థితి దయనీయంగా ఉంది. చాలాచోట్ల వరి నాట్లు పడలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వేసిన వరి నాట్లు కూడా బతికే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జలాశయం స్థిరీకరణ ఆయకట్టు 64 వేల ఎకరాలు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో 1,46,221 ఎకరాలకు సాగు నీరందించేందుకు తోటపల్లి ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు, కుడి కాలువ పనులు పూర్తి చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో లక్ష్యానికి తగ్గట్టు సాగు నీరు అందడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం... ఈ ఖరీఫ్ సీజన్లో కుడి కాలువ ద్వారా ఇప్పటి వరకు 71,792 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందింది. పిల్ల కాలువలు, స్ట్రక్చర్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రధాన కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. సుమారు 113 కిలోమీటర్ల పొడవుగల ఈ కాలువ సుమారు 50 కిలోమీటర్ల మేర (దాదాపు తెర్లాం మండలం నుంచి కాలువ చీపురుపల్లి వరకు) గడ్డి, అగురు వంటి పిచ్చి మొక్కలతో నిండి ఉంది. దీనికితోడు గడిచిన ఆరు నెలల్లో సీతానగరం, బొబ్బిలి మండలాల్లో కాలువకు మూడుసార్లు గండిపడింది. ఇలాంటి అవాంతరాల వల్ల సాగునీరందకపోవడంతో రైతులు ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు చివర ఉన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చుక్కనీరు కూడా అందడం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో 25,121 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఇప్పటి వరకు 17,252 ఎకరాలకు మాత్రమే అందినట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. అయితే, అసలు నీరే రాలేదని కొందరు రైతులు, కాలువల్లో నీరు తోడుకుని నాట్లు వేశామని మరికొందరు రైతులు 'ప్రజాశక్తి'కి చెప్పారు. ఈ నియోజకవర్గం పరిధిలోని గడిగెడ్డ ద్వారా 2,900 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. ఈ ఏడాది చుక్క నీరు కూడా అందలేదని గుర్ల మండలంలోని పకీరు కిత్తలి, పల్లెగండ్రేడు, కొండగండ్రేడు, ముద్దాడపేట, గరికివలస, తెట్టంగి, గూడెం, పున్నపురెడ్డిపేట, పాలవలస, ఘోషాడ గ్రామాల రైతులు తెలిపారు. తోటపల్లి నీరు రాకపోతే వరి నాట్లను బతికించుకోవడం కష్టమేనని, మదుపులు కూడా ఎక్కువగా అవ్వడం వల్ల అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రౌతు రమణ అనే రైతు 'ప్రజాశక్తి' వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రైతులు వర్షపు నీటిని ఒడిసిపట్టి 80 శాతం భూముల్లో అతి కష్టమ్మీద వరి నాట్లు వేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో 13,227 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. 1,627 ఎకరాలకు సాగునీరు అందించినట్టు అధికారులు చెప్తున్నారు. గతేడాది ఇదే సమయానికి శ్రీకాకుళం జిల్లాలో దీని ఆయకట్టు పరిధిలోని 20,437 ఎకరాలకు సాగు నీరందగా, ప్రస్తుతం 16,607 మాత్రమే అందింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 38,974 ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం 1627 ఎకరాలకే అందింది. బొబ్బిలి, రాజాం తదితర నియోజకవర్గంలోనూ అంతంతమాత్రంగానే నీరు అందినట్లు అధికారుల రికార్డులు తెలియజేస్తున్నాయి.
తోటపల్లి నీరు రాకపోతే అప్పులపాలే
తోటపల్లి జలాశయం నుంచి నీరు రాకపోతే ఈ ఏడాది అప్పులపాలే. గతంలో ఎంతోకొంత నీరు రావడంతో ఆశించిన దిగుబడి వచ్చింది. ప్రస్తుతం వర్షపు నీటితో నాట్లు వేశాం. ఇప్పటికీ చెరువులు నిండలేదు. ఎకరాకు రూ.25 వేలు చొప్పున మదుపుపెట్టాం. మునుపెన్నాడూ ఈ పరిస్థితి లేదు.
- పోతిన పాత్రుడు, రైతు, తాటిపూడి, గుర్ల మండలం
జిల్లా అదనపు ఆయకట్టు సాగునీటి లక్ష్యం ప్రస్తుతం అందిన నీరు
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
విజయనగరం 93,563 48,985
పార్వతీపురం 13,684 6,200
మన్యం
శ్రీకాకుళం 38,974 16,607
మొత్త్తం 1,46,221 71,792