
- పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ప్రజాశక్తి-పులివెందుల టౌన్/రూరల్/రాయచోటి :అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం దేశానికే ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. భాకరాపురం వద్ద రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకున్నారు. ఎపి కార్ల్‌లో రూ.9.96 కోట్లతో నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీ, రూ.11 కోట్లతో నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబరేటరీ, రూ.14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించారు. రూ.60 కోట్లతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్‌ను సందర్శించారు. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గన్న అనంతరం సాయంత్రం 5.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, కడప, రాజంపేట ఎంపిలు వైఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.