'రామాయపట్నం' పోర్టుకు భూమి పూజలో ముఖ్యమంత్రి జగన్
2023లో తొలిదశ పనులు పూర్తి
ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :'రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా పిషింగ్ హార్బర్ నిర్మిస్తాం' అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగనోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం రామాయపట్నం వద్ద రూ.3,743 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పోర్టుకు భూమి పూజ చేశారు. సాగరతీరంలో సముద్రంలోకి పూలు వదిలారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో నిర్వాసితులకు పట్టాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు వల్ల ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు వ్యాపారాలు బాగా సాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏర్పాటు చేసినా స్థానికులకు 75 శాతం ఉద్యోగులు కల్పించాలని తాము చట్టం తెచ్చామన్నారు. తద్వారా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, రామాయపట్నం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు నిర్మిస్తున్నామన్నారు. మరో రెండు నెలల్లో మిగిలిన పోర్టులకు శ్రీకారం చుడతామన్నారు. రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కలిపి ప్రతి 50 కిలోమీటరుకు ఒక ప్రాజెక్టు వస్తుందన్నారు. ప్రత్యక్షంగా మూడు వేల నుంచి నాలుగు వేల మందికి, పరోక్షంగా లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి దొరుకుందని పేర్కొన్నారు. తొలుత నాలుగు బెర్త్‌లు వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని, తరువాత ఒక్కో బెర్త్‌కు రూ.200 కోట్లు ఖర్చు చేసి మిగిలిన బెర్త్‌లూ పూర్తి చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి ఏటా 25 మిలియన్ టన్నుల కార్గో ఎగుమతి అవుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని పోర్టులూ పూర్తయితే 50 మిలియన్ టన్నుల కార్గో ఎగుమతి చేయవచ్చని తెలిపారు. రామాయపట్నం పోర్టు కోసం భూములిచ్చిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, కలెక్టర్ చక్రధర్‌బాబు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.










