Jul 23,2022 08:40
  • రైతులకు బెదిరింపులు
  • గ్రామస్తుల అనుమతి లేకుండానే ఇళ్లకు కొలతలు
  • ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న ప్రభావిత గ్రామాల ప్రజలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లాలో నిర్మించనున్న భావనపాడు పోర్టు కోసం ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నా, ప్రభుత్వం తన పని తాను కానిచ్చేస్తోంది. మంచి ప్యాకేజీ, పరిహారం ఇస్తా మంటూ ప్రలోభాలకు గురిచేస్తోంది. ప్రలోభాలకు లొంగని వారిపై బెదిరింపులకు దిగుతోంది. కొన్నిచోట్ల గ్రామస్తుల అనుమతి లేకుండానే ఇళ్లకు కొలతలు వేస్తుండడంతో, స్థానికులు ఆగ్రహంతో అడ్డం తిరుగుతున్నారు. సంతబొమ్మాళి మండలం భావనపాడు, మూలపేట గ్రామాల మధ్య పోర్టు నిర్మాణానికి 717.26 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రైతుల నుంచి 312.40 ఎకరాలు సేకరించేందుకు జిల్లా అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ 13న ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ వెలువరించారు. ఈ నెల ఏడున డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. రైతుల అనుమతి లేకుండానే రెవెన్యూ ఫైళ్ల ఆధారంగా ఫీల్డ్‌ సర్వే చేసి నోటిఫికేషన్‌ వెలువరించారు. భూములకు ఎంత ధర చెల్లిస్తారో ఏ దశలోనూ రైతులకు చెప్పలేదు. పోర్టు నిర్మాణంతో ఖాళీ చేయాల్సిన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఏమేం ఇస్తారో తెలియజేయలేదు. గ్రామాలను ఖాళీ చేయించి ఎక్కడికి పంపిస్తారో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు, స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోన్నా ప్రభుత్వం ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుంది. రైలు మార్గానికి 157.09 ఎకరాలు, రోడ్డు మార్గానికి 27.83 ఎకరాలు సేకరించే పనిలో అధికారులు నిమగమయ్యారు. నిర్వాసిత కాలనీల నిర్మాణం కోసం 50 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు.
 

                                                       పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడి

పర్యావరణ ప్రభావంపై సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ ఏడాది మే ఆరున అధికారులు గ్రామసభ నిర్వహించారు. పోర్టు నిర్మాణంతో తమ ప్రాంతం కాలుష్యమవుతుందని, జల జీవచరాలకు ముప్పు వాటిల్లుతుందని, మత్స్య సంపద దెబ్బతింటుందని స్థానికులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణానికి ఇప్పటివరకు ఎటువంటి అనుమతులూ రాలేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్తున్నారు. మరోవైపు పోర్టు నిర్మాణ పనులపై ప్రభుత్వం హడావుడి చేస్తోంది.
 

                                                            స్వరం మార్చిన అధికార పార్టీ నాయకులు

పోర్టు నిర్మాణం విషయంలో అధికార వైసిపి నాయకులు స్వరం మార్చారు. పర్యావరణ అభిప్రాయ సేకరణలో తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఇప్పుడు మౌనం దాలుస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించేలా మాట్లాడుతున్నారు. అధికారులు గ్రామాల్లోకి వస్తే రావద్దని ఎలా అనగలమని తిరిగి గ్రామస్తులనే ప్రశ్నిస్తున్నారు. వారిలో కొందరికి ఆక్రమించుకున్న భూములు ఉండడం, వాటికీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో వారు వెనక్కి తగ్గినట్లు గ్రామాల్లో చర్చ సాగుతోంది.

                                            పరిహారం ఏం ఇస్తారో చెప్పడం లేదు : గిన్ని బైరాగి, విష్ణు చక్రం

మా తాతదండ్రుల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న గెడ్డల్లో చేపలు, ఉప్పు పంట, ఇసుక దిబ్బలపై జీడి తోటలపై ఆధారపడి భార్యా పిల్లలతో బతుకుతున్నాం. నాకు ఎకరా పొలం ఉంది. అధికారులు వచ్చి పోర్టు కడతాం. గ్రామం ఖాళీ చేయండి. వేరేచోట ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఇంతవరకు ఏం పరిహారం చెల్లిస్తారో వివరించకుండా సర్వే చేయడానికి, ఇల్లు కొలతలు వేయడానికి గ్రామాల్లోకి అధికారులు వస్తున్నారు.

                                            మాకు చెప్పకుండానే ఇళ్లకు కొలతలు : జీరు ఎల్లయ్య, విష్ణుచక్రం

మా గ్రామంలోకి తహశీల్దార్‌ ఆఫీసోళ్లు వచ్చి ఇళ్లకు కొలతలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ ఉంటే అడ్డుకుంటామని వారు వస్తున్నట్లు కూడా చెప్పడం లేదు. మాకు ఏం పరిహారం ఇస్తారో, ఎక్కడకు పంపిస్తారో తెలియడం లేదు. మా అభిప్రాయం తీసుకోకుండా ఆధార్‌ కార్డు, బ్యాంకు పుస్తకం జిరాక్సు అడుగుతున్నారు. అధికారుల హడావుడి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు.

                                         ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి : జీరు భీమారావు, మూలపేట
పోర్టు నిర్మాణాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. ప్రభుత్వ భూముల్లో పోర్టును నిర్మించుకోవాలి. గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి.

                     2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లింపులు : హెచ్‌.వి జయరాం, టెక్కలి రెవెన్యూ డివిజనల్‌ అధికారి

పోర్టుకు భూముల కోసం రైతులను ఒప్పిస్తున్నాం. భూములు ఇచ్చేందుకు అంగీకరించకపోతే పోర్టు నిర్మాణం సాధ్యపడదు. పోర్టు నిర్మాణంతో నిర్వాసితులైన కుటుంబాలు, రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తాం.