Oct 08,2023 11:58

ఇస్లామాబాద్‌ :   పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన బలమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్‌ ప్రతినిధి ఆదివారం ప్రకటించారు. మృతుల సంఖ్య 2,000కు చేరుకుందని అన్నారు. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, అనంతరం బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ ప్రమాదంలో సుమారు 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది.  హెరాత్‌ ప్రావిన్స్‌ జెండా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూంకంపం దాటికి ప్రభావితమయ్యాయని విపత్తు అధికార ప్రతినిధి మహ్మద్‌ అబ్దుల్లా జాన్‌ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు 12 అంబులెన్స్‌లను ఆ గ్రామాలకు పంపినట్లు పేర్కొన్నారు. హెరాత్‌లో టెలిఫోన్‌ కనెక్షన్లు తెగిపోయాయని, ప్రభావిత ప్రాంతాల నుండి వివరాలు అందడం లేదని అన్నారు.

ఐక్యరాజ్యసమితి అందించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం.. 465 ఇళ్లు ధ్వంసం కాగా, మరో 135 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీంతో మృతుల సంఖ్య భారీగాపెరిగే అవకాశం ఉందని ఐరాస, స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

గతేడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భయంకరమైన భూకంపంలో దాదాపు 1,000 మంది మరణించారు. దాదాపు 10,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్  సరిహద్దుల్లో 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 13 మంది చనిపోయారు.