Nov 17,2020 19:43

ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న కొట్టాల గ్రామ మహిళలు

ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న కొట్టాల గ్రామ మహిళలు
డంపింగ్‌ యార్డు మాకొద్దు బాబోరు..
- ఆందోళన చేపట్టిన కొట్టాల గ్రామ మహిళలు
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం: పట్టణంలోని డంపింగ్‌ యార్డును మండలంలోని కొట్టాల గ్రామానికి తరలించవద్దని ఆ గ్రామానికి చెందిన మహిళలు మంగళవారం ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు షఫీ మాలిక్‌, ఎంపిడిఒ నరసింహారావు, నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు, సిఐ సురేష్‌ బాబు, ఎస్‌ఐ ప్రసాద్‌ రెడ్డి కొట్టాల గ్రామానికి చేరుకొని ఆందోళన చేస్తున్న మహిళలతో చర్చించారు. పట్టణంలోని చెత్తను ఇక్కడ వేయడం వల్ల గ్రామంలోని పిల్లలు పెద్దలకు అనారోగ్య సమస్యలు మొదలవుతాయని మహిళలు తెలిపారు. తమ గ్రామానికి పట్టణంలోని చెత్తను తీసుకురావద్దని అధికారులను కోరారు.
అధికారుల మాటలకు మహిళలు ససేమిరా అనడంతో వారితో మరో మారు చర్చించుకొని తెలపండి అని కమిషనర్‌కు సూచించి, అధికారులు వెనుదిరిగారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా గ్రామస్తులకు అవగాహన లేదని, పట్టణంలో లాగా చెత్తను సేకరించి కాల్చడం వల్ల వచ్చే పొగతో ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు భయపడుతున్నారని తెలిపారు. కానీ తరలించిన డంపింగ్‌ యార్డ్‌లో తడి చెత్తను వేసి దానిని పలు అధునాతన పద్ధతులలో దానికి వర్మీ కంపోస్ట్‌గా మారుస్తామన్నారు. మరోమారు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు.