- రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి
- కొనసాగిన ఐద్వా పోరుయాత్ర
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, నెల్లూరు : దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ దాడులు, హింస విపరీతంగా పెరిగిపోతున్నాయని ఐద్వా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభమైన 'మహిళా పోరుయాత్ర' తిరుపతి మీదుగా నెల్లూరు, విశాఖలో ప్రారంభమైన యాత్ర అనకాపల్లి జిల్లా మీదుగా కాకినాడకు ప్రవేశించింది.
నెల్లూరు బొల్లినేని సెంటర్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల బాలికలు, ప్రభుత్వ పాఠశాల బాలికలతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసను వివరించారు. ఈ హింసపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మానవత్వం ఉన్న రాజకీయ నాయకులెవరైనా సరే మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంతో విపక్షాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. బిజెపి చేస్తోన్న దురాగతాన్ని రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంతకుముందు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్‌లో యాత్రకు మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి మహిళా కళాకారులు ఆలపించిన గీతాలు, నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
కాకినాడ జిల్లా తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో ప్రజాసంఘాల నాయకులు జాతాకు స్వాగతం పలికారు. అనంతరం పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకున్న యాత్రకు సిఐటియు, మిడ్డే మీల్స్, తదితర సంఘాల నాయకులు, జడ్‌పి సెంటర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పిఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తుని, పిఠాపురం, కాకినాడలో జరిగిన సభల్లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి మాట్లాడారు. బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎపిలో 35 వేల మంది మహిళలు, చిన్నారులు అదృశ్యమైతే పాలకవర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పోక్సో చట్టాన్ని ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళలంతా ఉద్యమించాలని కోరారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు టి.రాజా తదితరులున్నారు.
- ఆలోచింపజేసిన ప్రదర్శనలు
పోరుయాత్ర సందర్భంగా ఐద్వా సభ్యుల ప్రదర్శనలు అందర్నీ ఆలోచింపజేశాయి 'ఎక్కడ వచ్చింది స్త్రీకి స్వాతంత్య్రం', 'ఎక్కడమ్మా నీవు లేనిది' నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. మద్యపానం వల్ల జరిగే అనర్ధాలను, మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ పలుచోట్ల వీధినాటికలు ప్రదర్శించారు.










