Aug 02,2023 21:54
  •  హింస లేని సమాజం కోసం చేయిచేయి కలుపుదాం
  • కొనసాగిన ఐద్వా పోరుయాత్ర

ప్రజాశక్తి- యంత్రాంగం : మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని, హింస లేని సమాజం కోసం చేయి చేయి కలుపుదామని ఐద్వా నేతలు అన్నారు. కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా విశాల పోరాటాలు నిర్వహించాలని, ఇందుకు యువత కలిసి రావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభమైన 'మహిళా పోరుయాత్ర' నెల్లూరు మీదుగా కడప జిల్లాకు, విశాఖలో ప్రారంభమైన యాత్ర కాకినాడ జిల్లా మీదుగా తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోనికి ప్రవేశించింది.
కడప జిల్లాలోని బద్వేలు, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరులో యాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడారు. మహిళల రక్షణే తమ లక్ష్యమంటూ గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు హింసకు గురవుతున్నారన్నారు. మత్తు, మద్యం వల్లే నిత్యం మహిళలు హింసకు, దాడులకు గురవుతున్నారని, వీటిని సంపూర్ణంగా నిరోధించాలని డిమాండ్‌ చేశారు. అదాని, అంబానీలకు దేశ సంపదను బిజెపి దోచిపెడుతోందని విమర్శించారు. ఖనిజ సంపదను దోచుకునేందుకు మణిపూర్‌లో రిజర్వేషన్‌ పేరుతో కులాల మధ్య చిచ్చురేపిందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కోరుకొండ, రాజమహేంద్రవరం, కడియం మండలాల్లో నిర్వహించిన సభల్లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి మాట్లాడారు. మణిపూర్‌లో జరుగుతున్న అమానుష ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనలపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీ వేయాలని కోరారు. సాంఘిక ఉద్యమాలకు కేంద్రమైన రాజమహేంద్రవరంలో ఐద్వా చేస్తున్న ఈ పోరాటాలకు నేటితరం కలిసి రావాలని కోరారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఎర్రంపాలెం ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సభనుద్దేశించి ఐద్వా ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి ఐ.పద్మ మాట్లాడారు. బిజెపి హయాంలో మహిళలకు భద్రత కరువైందని విమర్శించారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని, వేధింపులు నిరోధించేందుకు అంతరంగిక ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఐద్వా సభ్యులు వీధి నాటికలు, నృత్యరూపకాలతో అవగాహన కల్పించారు. ఈ యాత్రలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.సత్యవతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.పూర్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్‌.రమణి తదితరులు పాల్గొన్నారు.