Apr 22,2023 14:51
  • బాపట్ల పార్లమెంటు యస్.సి సెల్ అధ్యక్షులు బేతపూడి సురేష్ బాబు 

ప్రజాశక్తి-పర్చూరు : "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా , ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి (నిరసన తెలియజేయడానికి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ధళితులను రెచ్చగొట్టి జగన్ మోహన్ రెడ్డి దగ్గర మెహర్బాని (మెప్పు) పొందడం కోసం ధళితజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు నీతిమాలిన చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాపట్ల పార్లమెంటు యస్.సి సెల్ అధ్యక్షులు బేతపూడి సురేష్ బాబు
ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మాదిగలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్న స్పందించని మంత్రి సురేష్ బాబు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎర్రగొండపాలెం వచ్చిన చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునే ప్రయత్నంచేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్  మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు , దౌర్జన్యాలు , శిరోముండనాలు , హత్యలు మరియు ధళితమహిళలపై అత్యాచారాలు జరుగుతున్న స్పందించని మంత్రి సురేష్ బాబు దళితులపై ప్రేమ వలకబోసినట్లు నటించడం విడ్డూరంగా ఉందన్నారు. మీరు (సురేష్ బాబు) మంత్రిగా ఉండి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దళితజాతికి ఏవిధమైన మేలుచేకూర్చారో సమాధానం చెప్పాలని సురేష్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సభలకు వస్తున్న ప్రజాదరణను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నెముకలో వణుకు పుడుతుందని సురేష్ బాబు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి , ఉధ్యోగ అవకాశాలు లేక దళితులందరూ రోడ్డునపడితే  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు , మంత్రులుగా ఉండి మాట్లాడపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితికి నిదర్శనం అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ద్వారా ఎస్సీ కాలనీలో అభివృద్ధి , మౌళిక సదుపాయాలతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎస్సీలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని సురేష్ బాబు గుర్తుచేశారు. మంత్రి సురేష్ బాబు ఇటువంటి విధానాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో మంత్రి పర్యటనను ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి రాష్ట్రంలోని దళితులందరూ సిద్ధంగా ఉన్నారని సురేష్ బాబు హెచ్చరించారు.