Jan 08,2021 07:25

రామతీర్థం కోదండ రామాలయంలో రాముని విగ్రహం శిరస్సు ఖండించిన దుర్ఘటనను అవకాశంగా తీసుకుని బిజెపి, టిడిపి, జనసేన మత రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు బిజెపి, టిడిపి తెగ తాపత్రయ పడుతున్నాయి. నరేంద్ర మోడీ, అమిత్‌ షా లను తెప్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న విజయవాడ ఆర్టీసి బస్‌స్టాండు వద్దే సీతమ్మవారి విగ్రహం అపభ్రంశం అయ్యింది. నిన్న సింగరాయకొండలో నరసింహస్వామి విగ్రహానికి అపచారం జరిగిందని మరో వార్త.
ఎందుకు? ఎవరు చేస్తున్నారు?
రాష్ట్రంలో గత ఆరు నెలలుగా వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఎవరు? ఎందుకోసం చేస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. తన వైఫల్యాలు కప్పిపెట్టుకోడానికి అధికార పార్టీ వైసిపి యే దేవాలయాలపై దాడులు చేస్తున్నదని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ప్రజానుకూల పథకాలతో బలం పెరుగుతున్న అధికార పార్టీని ఎదుర్కోలేక ప్రతిపక్షమైన టిడిపి యే దేవునిపై దాడులు చేసి ఆ పాపం మాపై నెట్టే నీచమైన పనికి దిగిందని పాలక పార్టీ ప్రత్యారోపణలు చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టియన్‌ గనుక హిందూ దేవాలయాలు, దేవుళ్లపై దాడులు చేస్తున్నారని బిజెపి ఆరోపణ చేస్తున్నది.
దేవుడే దిక్కుగా భావిస్తున్న పార్టీలు
మనిషి తనకు అలవికాని ఆపద వచ్చినపుడు దేవుడిపై భారం వేసి ప్రశాంతత పొందుతాడు. ప్రజల ప్రయోజనాలను కాపాడలేని రాజకీయ పార్టీలూ దేవుడే దిక్కుగా చూస్తున్నాయి. ఇపుడు జరుగుతున్నది అదే. నిరుద్యోగం గతమేనాడూ లేనంతగా పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆకలితో మన దేశానిదే ప్రపంచంలో అగ్రస్థానం. పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు హరించి వేయడంలో మనదే ప్రపంచ రికార్డు. తారాపథంలో అంబానీ, అదానీలు...పాతాళంలో భారత ప్రజల బతుకులున్నాయి. పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకత, అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి బిజెపి కి దేవుడే దిక్కయ్యాడు. ప్రజల్లో దేవుడి ఆధారంగా భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలన్న కుట్ర ఇందులో ఇమిడి ఉంది.
ప్రశాంత రాష్ట్రంలో మతోన్మాద చిచ్చు
రాష్ట్రంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఊరికి ఒకటి రెండు కాదు. వీధి వీధికి ఉన్నాయి. ప్రతి ఊళ్లోనూ చర్చిలు ఉన్నాయి. దారి పొడవునా ప్రతి మలుపులో ఆంజనేయ విగ్రహం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వ హిందూ పరిషత్‌ అదే పనిగా విగ్రహాలు పెట్టించే పనిలో ఉన్నాయి. అక్కడక్కడా మసీదులు ఉన్నాయి. ప్రజలు ఎవరి నమ్మకాన్ని బట్టి వారు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ప్రజలు ఒకరి జోలికి ఒకరు వెళ్ళడం లేదు. దేవుడు, మతం పేరున అల్లర్లు, దాడులు, దౌర్జన్యాలు లేవు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలు ఐక్యంగా ఉంటే తమ రాజకీయాలకు తావుండదని ప్రజల మధ్య మతపరమైన విభజన తీసుకొచ్చే శక్తుల కుట్ర ఇందులో ఉందేమో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. విగ్రహాల విధ్వంసం ఉద్దేశపూర్వకంగా, పటిష్టమైన పథకం ప్రకారం జరుపుతున్నారు. లేకుంటే ఇన్ని వరుస ఘటనలు జరగవు. లేదా ఉన్మాదం తలకెక్కిన గుంపైనా చేసి వుండాలి.
ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్ర
రైతు ప్రజలకు తిండి పెడతాడు. కార్మికుడు ప్రజలకు అవసరమైన సమస్త సరుకులు ఉత్పత్తి చేస్తాడు. కార్మికులను దేశ విదేశీ బడా వ్యాపార సంస్థలకు బానిసలుగా చేసే లేబర్‌ కోడ్‌ లను మోడీ ప్రభుత్వం చేసింది. అందువలన బిజెపి ప్రభుత్వం పట్ల కార్మిక వర్గం కోపంగా ఉంది. మరో వైపు రైతును కార్పొరేట్లకు బలి చేసే వ్యవసాయ చట్టాలు మోడీ ప్రభుత్వం చేసింది. బిజెపి ప్రభుత్వం చేసిన చట్టాలు రద్దు చేయాలని రైతులు ఢిల్లీని ముట్టడించి ఉన్నారు. మోడీ చేసిన ప్రతి ప్రజా వ్యతిరేక చట్టానికి జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతన్నల పోరాటం మన రాష్ట్రంలో రైతులను, ప్రజలను ఆలోచింపచేస్తున్నది. రైతులు అటువైపు ఆలోచిస్తున్న కొద్దీ ఈ మూడు పార్టీలు చేసిన ద్రోహం రైతులు, ప్రజలు గ్రహించగలుగుతారు. ఈ మూడు పార్టీల అంబానీ, అదానీల సేవ కూడా ప్రజలకు అర్ధమైపోతుంది. ప్రజలను అటు వైపు చూడకుండా, ఆలోచించకుండా చేసేందుకు ఇలా గుళ్లు, దేవుళ్ల చుట్టూ అల్లర్లు జరుగుతున్నాయేమో పరిశీలించాలి.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అశోక్‌ గజపతి రాజు పట్ల దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వాడిన భాష సమస్యను రెచ్చగొట్టే విధంగా వుంది. బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారు సమస్యను జటిలం చేయరాదు. ఇన్ని దుశ్చర్యలు జరిగినా ఇంత వరకు ఒక్క నేరస్తుడునీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోలేదు. రాష్ట్రంలో నేరాలను నిరోధించడంలో ఘోరంగా విఫలమయ్యింది. మతోన్మాదుల ఆగడాలను అరికట్టడం లేదు.
రాముడి విగ్రహాన్ని కాపాడలేనందుకు పూసపాటి అశోక్‌ గజపతి రాజును రామతీర్థం ట్రస్టు చైర్మన్‌ పదవి నుండి తొలిస్తున్నట్లు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం జి.ఓ ఇచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన ప్రతి చోటా ఇలాగే వాటి చైర్మన్లను తొలగిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదా? దురుద్దేశాలతో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సమస్యను పరిష్కారం చేయదు. జటిలం చేస్తుందని జగన్‌ ప్రభుత్వం గుర్తించడం మంచిది.
సిఐడి ని నమ్మరట.. సిబిఐ ని నమ్మాలట..
రామతీర్థం ఘటనపై దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి కి అప్పచెబుతానంటున్నది. మేం సిఐడి ని నమ్మం. సిబిఐ కి అప్పజెప్పమని బిజెపి డిమాండ్‌ చేస్తున్నది. అంతర్వేది ఘటనపై బిజెపి డిమాండ్‌ మేరకు జగన్‌ ప్రభుత్వం సిబిఐ కి అప్పజెప్పింది. ఇంత వరకు దర్యాప్తు ప్రారంభించనే లేదు. పైగా సిబిఐ ని ఎందుకు నమ్మాలి? అది కేంద్రం చేతిలో పావు అని ఎవరికి తెలియదు? అందువలన సిట్‌ దర్యాప్తునకు ఆదేశించడం ఉత్తమం.
బిజెపి ముందు టిడిపి నిలబడలేదు
రాష్ట్రం హక్కులు కేంద్రం కాజేస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలకు జరిగే నష్టంపై స్పందించని బాబు రామతీర్థం విచ్చేసి రాముడిపై రాజకీయాలు చేయడం అనుచితం. చంద్రబాబుకు దేవుడి రాజకీయాలు సహకరించవని గుర్తించడం మంచిది. పాపం చంద్రశేఖరరావు ఎన్ని యాగాలు చేసినా బిజెపి మతోన్మాదం ముందు పని చేయలేదు. మతోన్మాదం ఎజెండా బిజెపి ది. ఎంత కష్టపడ్డా బిజెపి అంత ఉన్మాదం చంద్రబాబు రెచ్చగొట్టలేరు. పుట్టిన దగ్గర నుండి బిజెపి పని మతోన్మాదం రెచ్చగొట్టుడే. దానితో కలిసి చేసినా, విడిగా చేసినా బిజెపి కే లాభం. బిజెపితో రాజీ పడ్డవాళ్లంతా మట్టికొట్టుకుపోయిన అనుభవం కళ్ళెదుటే ఉంది. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి కి నేటి ఈ దుర్గతి విచారకరం.
గోతికాడ నక్కలా బిజెపి
వైసిపి, టిడిపి కీచులాట గోతికాడ నక్కలా కాచుక్కూర్చున్న బిజెపి ఉపయోగించుకుంటున్నది. దేశాన్ని, దేశ సంపదను, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, రైల్వే, విద్య, వైద్యం, వ్యవసాయం, మార్కెట్‌ సర్వం బడా వ్యాపారులకు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చేయడం, దేముడూ రాముడూ అంటూ జనానికి ఉన్మాదం ఎక్కించడమే సంఫ్‌ు పరివారం పని. అవకాశం దొరికినప్పుడల్లా ఇతర మతాల పట్ల ద్వేషం రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నది. వాళ్ళ పుట్టుకే అది. చేగువేరా ఫోజులిచ్చి, అంబేద్కర్‌ సిద్ధాంతం చెప్పి బిజెపి ఉచ్చులో పడ్డ పవన్‌ కళ్యాణ్‌ దాంతో చేరడం అవకాశవాదానికి పరాకాష్ట. జగన్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ దేశానికి పట్టిన మతోన్మాద చీడను గుర్తించడం లేదు. రాజ్యాంగ వ్యతిరేక మనువాద పార్టీ బిజెపి ముప్పు గమనించడం లేదు.
రాష్ట్రానికి బిజెపి ద్రోహం
జెపి కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నిండా ముంచేయడమే గాక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి ఆర్థిక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నం పోర్టు ఇవ్వలేదు. విభజన చట్టాన్ని అమలు చేయలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరంలో 3 లక్షల మంది ప్రజలకు రూ.33 వేల కోట్ల పునరావాస ప్యాకేజీని ఎగ్గొట్టింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోస్కో విదేశీ కంపెనీకి ఇచ్చివేసే నిర్ణయం చేసింది. అన్ని విధాలా మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి తను చేసిన పాపాల నుండి జనం దృష్టి మళ్లించేందుకు...ఇటువంటి ఘటనలతో ప్రజలను ఉన్మత్తులను చేసి తద్వారా రాష్ట్రంలో బలపడేందుకు...దేవుడిపై రాజకీయాలు చేస్తున్నది.
మత రాజకీయాలను తిప్పికొట్టాలి
ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమే బిజెపి. దాని అనుబంధ సంస్థలు విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌్‌ వంటి శక్తులు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. మత రాజ్యమే దాని లక్ష్యం. మతోన్మాదం అందుకు మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి మతోన్మాదం రెచ్చగొట్టడానకే కంకణం కట్టుకున్నది. కనుక ఇలాంటి ఘటనను సృష్టించడం. తరువాత అల్లరి చేయడం బిజెపి అనుబంధ మూకలకు అలవాటే. అప్రమత్తంగా లేకుంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారు. పాలక పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తమ స్వంత ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రయోజనాలపై బిజెపితో రాజీ పడుతున్నాయి. అందువలనే రాష్ట్రంలో మతోన్మాదం పెరిగేందుకు తావిస్తున్నాయి. ప్రజలే విజ్ఞతతో ఆలోచించి మన దేశ లౌకిక రాజ్యాంగానికి, ఫెడరల్‌ రాజ్య వ్యవస్థకు పెను ముప్పుగా దాపురించిన బిజెపి మతోన్మాదాన్ని ఎండగట్టి రాష్ట్రంలో మత సామరస్యం కాపాడుకోవాలి. లేదంటే రాష్ట్రం అల్లకల్లోలమై అంధకారంలో చిక్కుకుంటుంది.
                                                           దేవుడితో రాజకీయాలా?         ఎం. కృష్ణమూర్తి        (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)