Oct 27,2022 07:16
  • కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 35 వేల ఎకరాల్లోపైగా నష్టం
  • పరిహారం కోసం అన్నదాతల ఎదురుచూపులు

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : గత నెల చివరి వారంలోనూ, ఈ నెల మొదటి వారంలోనూ రాష్ట్రంలో పలు జిల్లాలతోపాటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు వాన దెబ్బకు పొలంలోనే కుళ్లిపోయాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 35 వేల ఎకరాల్లోపైగా పంటలకు నష్టం వాటిల్లింది. పూర్తి స్థాయి అంచనాలు వేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లాలో ఈ నష్టం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ జిల్లాలో 21,651 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. నంద్యాల జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 61,224 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. వర్షాలకు ఇందులో 7,586 ఎకరాల్లో పంట దెబ్బతింది. 1,74,917 ఎకరాల్లో వరి, 1,05,252 ఎకరాల్లో కంది, 70,195 ఎకరాల్లో మొక్కజొన్న, 34,177 ఎకరాల్లో వేరుశనగ, 9,555 ఎకరాల్లో మినుము, 17,890 ఎకరాల్లో మిరప, 3,132 ఎకరాల్లో సోయాబీన్‌, 677 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటలను సాగు చేశారు. వర్షాలకు మొక్కజొన్న 6,505 ఎకరాల్లో, మినుము 2,428 ఎకరాల్లో, వరి 1600 ఎకరాల్లో, కంది 1440 ఎకరాల్లో, సోయాబీన్‌ 1,375 ఎకరాల్లో, వేరుశనగ 360 ఎకరాల్లో, జొన్న 120 ఎకరాల్లో, పొగాకు 60 ఎకరాల్లో, కొర్రలు 57.5 ఎకరాల్లో, జనుము 50 ఎకరాల్లో, ప్రొద్దుతిరుగుడు 40 ఎకరాల్లో, పెసర 27.5 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 622 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా, 635 మిల్లీమీటర్లు నమోదైంది. కర్నూలు జిల్లానూ వర్షం కుదిపేసింది. ఖరీఫ్‌లో పత్తి 5,81,997 ఎకరాల్లో, వేరుశనగ 1,76,295 ఎకరాల్లో, కంది 48,034 ఎకరాల్లో, మిరప 30,472 ఎకరాల్లో, వరి19,655 ఎకరాల్లో, మొక్కజొన్న 8,325 ఎకరాల్లో, ప్రొద్దుతిరుగుడు 1,785 ఎకరాల్లో, జొన్న 95 ఎకరాల్లో సాగు చేశారు. భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 12,522 ఎకరాల్లో పంటలకు వాన దెబ్బ పంట నష్టం వాటిల్లింది. ఈ నెల ఒకటిన కురిసిన భారీ వర్షానికి 4,465 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆరున తుంగభద్రకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో 4,366 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. పత్తి 2,737 ఎకరాల్లో, మిరప 524 ఎకరాల్లో, వరి 370 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. పరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు నేటికీ పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలను రూపొందించలేదు.

  • పత్తి మొక్కలు చనిపోయాయి

రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాను. భారీ వర్షానికి పొలంలో నీరు నిలిచి మొక్కలు చనిపోయాయి. ఎకరానికి కౌలు రూ. 15 వేలు, పెట్టుబడి రూ.70 వేలు చొప్పున మొత్తం రూ. 1.70 లక్షలు పెట్టుబడి అయింది. భారీ వర్షాలకు మొత్తం నష్టపోయాను. ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
- వర శంకర్‌, పెద్దరాజుపాలెం, బనగానపల్లె మండలం, నంద్యాల జిల్లా