Jul 31,2023 14:54

ప్రజాశక్తి-శ్రీకాకుళం : కడపలో స్టీల్ ప్లాంట్ ను ఎర్పాటు చేయాలని, విభజన హామీలు అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేసారు. కడప స్టీల్ పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ(యం) ఆద్వర్యంలో ఎచ్చెర్ల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాష్ట్ర ప్రగతి కోరుకునేవారు ఖండించాలని పిలుపునిచ్చారు. కడపలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కార్మాగారం నిర్మింస్తుందంటూ ఆర్భాటంగా శంఖుస్థాపన చేసినప్పటికీ ఇప్పటికీ దానికి అతీగతీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పార్లమెంటులో ప్రకటన చేస్తుంటే రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార, వైసిపి, ప్రతిపక్ష టిడిపి పార్లమెంటు సభ్యులు మారు మాట్లాడకుండా కూర్చోవడం కేంద్ర బిజెపి ప్రభుత్వానికి సాగిలపడడమేనని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. ప్రజల త్యాగాలతో, ప్రజా ధనంతో నిర్మించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కారు చౌకగా కార్పొరేట్ లకు కట్టబెట్టడానికి కుట్రపన్ను తుందని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ ఆపాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయుకులు పి.తేజేశ్వరరావు, డి.బంగర్రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.