- విద్యుత్తు చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు
- విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి అంటూ నిరసన
ప్రజాశక్తి-చీరాల: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో భాగంగా స్మార్ట్ మీటర్లను తీసుకువచ్చి ప్రజల సొమ్మును దోపిడి చేసేందుకు కుట్ర పన్నిందని తక్షణమే విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని లేకుంటే బషీర్ బాగ్ ఉద్యమానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో స్మార్ట్ మీటర్ల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరీంచుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యవస్థలను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టి విద్యుత్తు చార్జీలను అమాంతంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరగగొడుతున్నారని అన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం అదానికి విద్యుత్ రంగాన్ని అప్పగించి దేశాన్ని దేశ ప్రజలపై పెను భారాన్ని మోపిందని ఆ నిర్ణయానికి మన రాష్ట్ర ప్రభుత్వం అమలుకు పూనుకోవటం సిగ్గుచేటన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ వాడుకోవాలంటే సెల్ ఫోన్స్ లో రీఛార్జి చేసుకున్నట్లుగా ఈ మీటర్లకు ముందే ప్రజలు డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తుంది అన్నారు. కేంద్ర ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందని ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. పథకాలపై పెట్టే దృష్టి ప్రజలపై విద్యుత్ బారాలు పడకుండా ముఖ్యమంత్రి వ్యవహరించాలి అన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెంచితే బషీర్ బాగ్ ఉదంతంలో ఎలా జరిగిందో అందరికి తెలిసిందే అన్నరు. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారు అని ఆ సంఘటన సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తుచేసుకోవాలని అన్నారు. కావున ప్రజలందరూ సంఘటితమై అటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబూరావు,కొండయ్య,వసంతరావు, జయరాజు,జనసేన పార్టీ నాయకులు గూడూరి శివరామ ప్రసాద్, తెలుగుదేశం చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కోండ్రు రత్నబాబు, సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు.










