ప్రజాశక్తి-నందిగామ : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు కె.గోపాల్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య సిలెండర్ రూ.350 నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్యాస్ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పెంచడం దారుణమన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వరకు రు.417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర నేడు రు.1155కు పెంచటం శోచనీయమన్నారు. ప్రభుత్వం సబ్సిడీ జమలు రెండు సంవత్సరాల నుండి నిలిపివేసిందన్నారు. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ క్రింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారన్నారు. ఇది పూర్తిగా పేద, మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదన్నారు. వాణిజ్య సిలెండరు ఒక్కసారిగా రు.350 పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్న వారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ధరలు పెరుగుతాయని, ఆర్ధిక మాంద్యం వలన చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుందన్నారు. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయమన్నారు. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఆదానీ కుంభకోణం నుంచి బయటపడటానికి భా పేదలప్తె వేస్తున్నారన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించి, సబ్సిడీని పునరుద్ధరించాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జి గోపి నాయక్,సయ్యద్ ఖాసిం, బచ్చలకూర లాజర్ , ఉప్పు ఁశీను, పుల్లయ్య ,వెంకయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










